KCR Secrete Meeting: ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ పార్లమెంటీరియన్ గా, ఏ అంశంపైన అయినా అనర్గళంగా మాట్లాడగలరు. చర్చించగలరు. సమైఖ్యాంధ్ర సమయంలో కీ రోల్ పాత్ర వహించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అటువంటి వ్యక్తి సైద్ధాంతికంగా బద్ధ శత్రువైన కేసీఆర్ తో చర్చలకు కూర్చున్నారు. దీంతో ఉభయ రాష్ట్రాల్లో చర్చలు ఊపందుకున్నాయి. తీరా అది భారతీయ రాష్ట్ర సమితి గురించి అని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో కేసీఆర్ నేత్రుత్వంలో పురుడు పోసుకోనున్న పార్టీకి ఏపీ రాష్ట్ర ఇన్ చార్జి బాధ్యతలను ఉండవల్లికి అప్పగించడమే ఈ సమావేశం అజెండా అయితే కేసీఆర్‌కు అరుణ్‌కుమార్ గట్టి షాకిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి ఏపీ ఇన్‌ఛార్జి పదవిని ఇవ్వజూపగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో సమావేశమై ఏపీకి రాగానే ఇన్‌ఛార్జి పదవి సిద్ధంగా ఉన్నట్లు తేలడంతో ఉండవల్లి కంగారుపడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.రాజకీయాల నుంచి తాను పూర్తిగా విరమించానని ఆ సమావేశంలో ఉండవల్లి చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేసినట్లు అర్థమవుతోందని రాజకీయవేత్తలు భావిస్తున్నారు.

కేసీఆర్ తో పొగడ్తలు..
పనిలో పనిగా ఉండవల్లి కేసీఆర్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు.జాతీయస్థాయిలో నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి, ఆయనకు ధీటైన ప్రత్యర్థి కేసీఆర్ ఒక్కరేనని తేల్చిచెప్పారు. కేసీఆర్ చెప్పిన విషయాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, ఆయన సరైన ఆలోచనా విధానంతో, సరైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని అర్థమవుతోందన్నారు. ఇంకా ఉండవల్లి ఈ విధంగా అన్నారు. ‘కేసీఆర్ వంటి మనిషి ఫోన్ చేసి సామాన్యుడినైన నన్ను పిలిచారు. ఆయన ఒక ఎజెండాతో ఉన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపాలని, ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది.. ఎంత పవర్ జనరేషన్ ఉంది.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయాలపై చాలా హోంవర్కు చేశారాయన. వాటిని ఒక్కొక్కటి చెబుతూ నన్ను అడుగుతుంటే ఆశ్చర్యపోయాను. ఇంత గౌరవం ఇచ్చి, ఎక్స్‌ప్లెయిన్ ఎందుకో చేశారో ఆయన్నే అడగాలి. నేను రాజకీయాల్లో లేనని, రిటైరైపోయానని ఆయనకు మొదట్లోనే చెప్పాను. నేను చాలా హ్యేపీగా ఉన్నానని.. రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదని.. ఆ శక్తీ లేదని వివరించాను. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతుంటానని, ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదని కూడా చెప్పాను. టీవీల్లో మరింత ఎక్కువగా మాట్లాడాలని కేసీఆర్ అన్నారు. బీజేపీ ఓట్లు పెరగకూడదని, అది పెరిగితే చాలా ప్రమాదమని, అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటనేది ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు.త్వరలో మళ్లీ పిలుస్తానన్నారు. తప్పకుండా వస్తానన్నాను. మాతోపాటు ప్రశాంత్‌కిశోర్ కూడా ఉన్నారు. అన్నీ విన్నారు. కానీ చర్చలో పాల్గొనలేదు. మరో ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ ఉన్నారు. హరీశ్ రావు నన్ను రిసీవ్ చేసుకుని అరగంట మాట్లాడిన తర్వాత కేసీఆర్ వచ్చారు. ఆయన మంచి కమ్యూనికేటర్.. అన్నీ చాలా క్లారిటీగా చెప్పారు. కేసీఆర్ మంచి వక్త. ఆంగ్లం, తెలుగు, హిందీలో కూడా మాట్లాడగలరు. మమతా బెనర్జీ అంతగా మాట్లాడలేరు. మోదీలా అందరినీ ఆకట్టుగోగల శక్తి కేసీఆర్‌కు ఉంది. కచ్చితంగా బీజేపీ వ్యతిరేక వైఖరితో అందరినీ లీడ్ చేయగల శక్తీ ఉంది. బీజేపీ కాన్సెప్ట్ వల్ల దేశానికి నష్టం. వాజ్‌పేయి ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇవాళ సోనియాగాంధీ, రాహుల్‌కు కూడా సమన్లు ఇచ్చారు. మాట్లాడే పరిస్థితిలో ఎవరూలేరు. ఈ పరిస్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడినప్పుడు, అది నచ్చినవారంతా ఆయనకు సపోర్టు చేయాలి. కాంగ్రెస్ బలం తగ్గింది. ఎవరో ఒకరు జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకోవాలి. మోదీ ఓ రాజులా పాలిస్తున్నాడు. ఎదురుతిరిగితే నరికేస్తాఅన్నట్లు ఉంది’అని ఉండవల్లి తన మనసులో మాటలను, కేసీఆర్ తో జరిగిన చర్చలను బయటపెట్టేశారు..

బీజేపీపై వ్యాఖ్యలు..
ఇక బీజేపీ పై కూడా ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హిందూమతం పేరిట దేశంలో రాజకీయాలు మంచిది కాదు. నేను బీజేపీకి వ్యతిరేకిని కాదు. మోదీ ప్రధాని అయినా నాకు నష్టం లేదు. కానీ వాళ్ల విధానాల వల్ల దేశానికి ప్రమాదం ఉంది. నాలుగైదు దేశాల్లో నేరుగా హైకమిషన్ పిలిచి క్షమాపణ కోరే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల మీద మనం ఆధారపడి ఉన్నాం. మన మీద ప్రపంచమూ ఆధారపడి ఉంది. అమెరికాలో 77 శాతం ప్రజలు క్రిస్టియన్లే. అక్కడ హిందువులు గుండ్లు కొట్టించుకుంటున్నారు. బొట్టు పెట్టుకుని ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఇస్లామిక్ దేశా లు కూడా హిందూ దేవాలయాల నిర్మాణానికి అనుమతిస్తున్నాయి. కానీ ఈ వేళ గల్ఫ్ దేశాలు ఇచ్చిన తాఖీదు వల్ల మన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన గుడ్‌విల్ పోయింది. హిందూ మతం పేరుతో మనపై దాడి చేస్తారని ప్రపంచం భావిస్తే మనకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టడానికి ప్రశ్నించే ప్రతిపక్షం బలంగా ఉండాలి’అని కూడా ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి భారతీయ రాష్ట్ర సమితి బాధ్యతలు తీసుకోమంటే.. సున్నితంగా తిరస్కరించిన ఉండవల్లి కేసీఆర్ ను మాత్రం దేశంలోనే మహనీయ నేతగా అభివర్ణించడం చర్చనీయాంశంగా మారింది.