Tollywood Jagan: ఏపీ సీఎం జగన్ ఈ మధ్య వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. బాగా ఫోకస్ ఉండే టాలీవుడ్ విషయంలో బలాబలాలు చూసి కరెక్ట్ వ్యక్తులతోనే రాయబారాలు నడుపుతున్నారు. టాలీవుడ్ కు ‘మా’ అసోసియేషన్ ఉన్నా.. మా అధ్యక్షుడు మంచు విష్ణు బావమరిది అయినా.. మోహన్ బాబు దగ్గరి బంధువు అయినా కూడా వారిని ఆహ్వానించకుండా చిరంజీవి అండ్ కోను పిలవడం ద్వారా జగన్ లెక్కలు పక్కాగా ఉన్నాయంటున్నారు.
సినీ ఇండస్ట్రీ సమస్యలపైన చర్చల కోసం చిరంజీవి టీం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అయితే గతంలో చిరంజీవి టీంలో నాగార్జునతోపాటుగా దర్శక నిర్మాతలు మాత్రమే సీఎం జగన్ తో భేటి అయ్యారు. కానీ ఈసారి అనూహ్యంగా హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ సైతం హాజరయ్యారు.
జనవరి నెలలో చిరంజీవి అమరావతిలో సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో తనను ఒక్కడినే సీఎం ఆహ్వానించారని.. అందుకే తానొక్కడినే వచ్చానంటూ చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ నుంచి గన్నవరం బయలు దేరే ముందు చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఎవరు వస్తున్నారో తనకు తెలియదని.. మీడియాలో వస్తున్న పేర్లే తాను వింటున్నానని చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవితోపాటు నాగార్జున, ఎన్టీఆర్ లేకపోవడం చర్చనీయాంశమైంది.
అమలకు కరోనా రావడంతోనే నాగార్జున ఈ టూర్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, మహేష్, రాజమౌళి రాక వారి సినిమాల కోసమేనన్న చర్చ సాగుతోంది. త్వరలో రాధేశ్యామ్, సర్కార్ వారిపాట, ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఉండడంతో ఈ ముగ్గురు వచ్చినట్టు తెలుస్తోంది. మంచు కుటుంబానికి దగ్గరగా ఉండే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ను చిరంజీవి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో స్టూడియో పెడితే అందులో పెట్టుబడులకు మహేష్ సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రభాస్ సైతం వ్యూహాత్మకంగానే జగన్ ను కలవడానికి వస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రస్తుతం ‘మా’ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఇండస్ట్రీ పెద్ద కావడంతో ఆయన తరుఫున ప్రభాస్ ను చిరంజీవి రప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ తరుఫున రాజమౌళి వచ్చినట్టు తెలుస్తోంది. వారిద్దరికి మంచి అనుబంధం ఉంది.
ఇక అగ్రహీరోలు, ప్రముఖులు ఇండస్ట్రీని ఏపీలో విస్తరించే అంశాలపై జగన్ ఒప్పించనున్నారని తెలుస్తోంది. ప్రీ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏపీలో నిర్వహించాలని.. దీంతోపాటుగా ఏపీలో షూటింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ కోరనున్నట్లు సమాచారం. లోకేషన్ ఫీజులను సైతం మినహాయింపు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.
విశాఖ కేంద్రంగా స్టూడియోల నిర్మాణంపైన కూడా చర్చ చేపట్టాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ఈ స్టూడియోల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ పరిశ్రమ ఏం కోరుకుంటుందో అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జగన్.. అదే సమయంలో పరిశ్రమ నుంచి ఏపీకి ప్రయోజనం.. గుర్తింపు ఉండాలనే కోణంలో చర్చలు చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అందుకే ఫిలించాంబర్, ‘మా’ సంఘం, నిర్మాతల కౌన్సిల్ ఉన్నా వారందరినీ కాదని.. టాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులతోనే ఈ చర్చలకు జగన్ పూనుకున్నారని తెలుస్తోంది. సమస్యను తేల్చడానికే కీలక వ్యక్తులను రప్పించినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత అసలు నిజాలు తెలియనున్నాయి.