Journalism : కరోనా కాలంలో ఆ పత్రిక సంస్థలో 16 మంది ఉద్యోగులు కన్నుమూశారు. ఉదయం లేస్తే సుద్దులు చెప్పే ఆ పత్రిక యజమాని కం సీనియర్ జర్నలిస్ట్ ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదు. పైగా చాలామంది ఉద్యోగులను కాస్ట్ కటింగ్ పేరుతో అడ్డగోలుగా తీసిపడేశాడు. ఉన్నవాళ్లకు అంతంత మాత్రమే జీతాలు ఇచ్చాడు. ఒక సంవత్సరం తర్వాత ఇన్నాళ్లు వాళ్ళ జీతాల్లో కోసిన నగదును ఇంక్రిమెంట్ పేరుతో పెంచినట్టు జబ్బలు చరుచుకున్నాడు. ఇక కోవిడ్ కాలంలో ఈయన సంస్థలో పనిచేస్తున్న ఓ స్టేట్ బ్యూరో రిపోర్టర్ ఉద్వాసనకు గురయ్యాడు.. అదే సంస్థలో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సదరు స్టేట్ బ్యూరోలో పనిచేసే రిపోర్టర్ ను ఆ సంస్థ వెబ్ ఎడిషన్ లో ఒక రైటర్ గా కుదిరించాడు.. జర్నలిజం తప్ప వేరే వ్యాపకం తెలియని సదరు వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తం అందులో చేరాడు. అందులోనూ అంతంత మాత్రంగానే వేతనాలు ఉండటంతో చేసేది ఏమీ లేక.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదే క్రమంలో అనారోగ్యం పాలయ్యాడు..
ఇక సదరు పత్రిక సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం వెల్ఫేర్ ఫండ్ పేరుతో ప్రతీ ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని సంస్థ మినహాయించుకుంటుంది. కానీ ఈ సొమ్ములో ఒక్క పైసా కూడా ఏ ఉద్యోగి సంక్షేమం నిమిత్తం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.. కోట్లకు కోట్లు సంక్షేమ నిధి పేరుతో బ్యాంకులో వేసిన సదరు యాజమాన్యం ఆ వడ్డీని కూడా సొంతానికే వాడుకుంటుంది. అంతటి కరోనా సమయంలోనూ ఏ ఒక్క ఉద్యోగికి కూడా రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు..
ఇక సదరు వెబ్ ఎడిషన్ లో పనిచేసే వ్యక్తి కాలు ఇన్ఫెక్షన్ కి గురి కావడంతో దాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.. కాలు కుళ్ళిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దానిని తొలగించారు.. అయితే అతడు ఆసుపత్రి పాలు కావడంతో సదర్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.. అయితే అతడు చావు బతుకుల మధ్య ఉన్న నేపథ్యంలో… అతడి ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు.. అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న సదరు అసిస్టెంట్ ఎడిటర్ పత్రిక వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ సెండ్ చేసాడు.. క్రౌడ్ ఫండింగ్ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చాడు.. ఇదే విషయాన్ని సదరు సంస్థ ఎండి దృష్టికి తీసుకెళ్తే రెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చాడు.
కానీ రాష్ట్ర రాజకీయాలను శాసించగల స్థాయిలో ఉన్న పత్రికాధినేతకు 8 లక్షలు ఓ లెక్క కాదు.. రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన ఘనుడాయన.. ఆయన తలుచుకుంటే రూపాయి ఫీజు లేకుండానే సదరు ఉద్యోగికి వైద్యం చేయించవచ్చు. లేదా వెల్ఫేర్ ఫండ్ నుంచి కొంత వైద్యానికి కేటాయించవచ్చు.. అవి ఇవి చేయకుండా అంతంతమాత్రంగా వేతనాలు ఉండే ఉద్యోగులు తలా కొంత సాయం చేయాలని యాజమాన్యం పిలుపునివ్వడం ఆ సంస్థ దివాళకోరు తనానికి నిదర్శనం..
ఉదయం లేస్తే అందర్నీ చెడుగుడు ఆడుకునే ఆ సంస్థ ఎండీ.. ఉద్యోగుల విషయంలో మాత్రం మొదటినుంచి నియంతగానే ఉంటాడు.. వేరే గత్యంతరం లేక అందులో పడి చాలామంది ఉద్యోగులు పనిచేస్తున్నారు గానీ.. లేకుంటే అది ఎప్పుడో మూతపడేది. ఇక గ్రూపులో క్రౌడ్ ఫండింగ్ కు సంబంధించి మెసేజ్ రావడంతో సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు యాజమాన్యం దగ్గర వెల్ఫేర్ ఫండ్ కు సంబంధించి డబ్బులు ఉన్నాయి.. అవి కేటాయిస్తే బాగుండేది కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. మరికొందరైతే ఇంతమంది ఉసురు పోసుకొని ఏం బాగుపడతారని శాపనార్ధాలు పెడుతున్నారు.. మరి ఈ విషయం ఆ సంస్థ ఎండికి తెలిసిందో లేదో?