CCTV Cameras: నేరాల సంఖ్య పెరిగిపోతుండడంతో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యమవుతోంది. దీనికి తోడు పోలీస్ శాఖ కూడా సీసీ కెమెరాల ఏర్పాటును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తోంది. సీసీ కెమెరాలు వల్ల నేరాలకు అడ్డుకట్టపడుతోందని పోలీస్ శాఖ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అలా ఉందంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పోలీస్ మార్కు న్యాయం అందరికీ ఒకే విధంగా అందడం లేదు. సామాన్యుల విషయంలో పోలీస్ శాఖ ఒక తీరుగా ఆలోచిస్తుంటే.. తమ దాకా వచ్చేసరికి మరో విధంగా ఆలోచిస్తోంది.
జల్లెడ పట్టి అరెస్టు చేశారు
ఓ పోలీసు అధికారి తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. ఆగమేఘాల మీద సీసీకెమెరాలను జల్లెడపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. దోపిడీలు, దొంగతనాలు.. ఇలా ఎన్నో కేసులను నిఘానేత్రాల సాయంతో ఛేదించారు. మైనా రాములు లాంటి సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు.. బేగంపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు.. ఐదారొందల సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి, అతణ్ని కటకటాల పాలు చేశారు. కానీ, అదేం విచిత్రమో..! పోలీసులపై మచ్చపడ్డ కేసుల్లో మాత్రం ‘సీసీ కెమెరాలు పనిచేయడం లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది.
సీసీ కెమెరాలు ఉన్నాయి సరే..
దేశంలోనే అత్యధిక సీసీకెమెరాలను ఇన్‌స్టాల్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిగడించింది. అంతేనా..? హైదరాబాద్, ఇంకా చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లు, కాలనీలు, దుకాణాలు, అపార్ట్‌మెంట్లు, కాలనీలు.. ఇలా ఓ గ్రిడ్ మాదిరిగా సీసీకెమెరాల నిఘా కొనసాగుతోంది. ప్రధాన రహదారుల్లో అంగుళం.. అంగుళం ఫుటేజీని రికార్డ్ చేయడమే కాకుం డా, పాతనేరస్తులను గుర్తించగలిగే అనలిటికల్ కెమెరాలు కూడా నగరానికి సొంతం.. సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలను పసిగట్టడంలోనూ నిఘానేత్రాలే కీలకపాత్ర పోసిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఉన్నదున్నట్లు.. జరిగింది జరిగినట్లు.. కళ్లకు కట్టినట్లు చూపించడంలో.. కోర్టుల్లో నిందితులకు శిక్షపడేలా డిజిటల్ ఎవిడెన్స్‌ను అందజేయడంలో సీసీకెమెరాల భాగస్వామ్యం ఎనలేనిది. పార్థి గ్యాంగ్, స్టూవర్టుపురం ముఠాలు, నీల్‌షికారీ, రాంజీనగర్ అటెన్షన్ డైవర్షన్, చెడ్డీ గ్యాంగ్‌లు కూడా సీసీ కెమెరాల దెబ్బకు జీహెచ్‌ఎంసీ పరిధిలో దొంగతనాలు చేయడానికి సాహసించడం లేదు. కానీ, పోలీసుల తప్పిదాల విషయానికి వచ్చేసరికి నిఘానేత్రాలు అటకెక్కుతున్నాయి. పోలీసులపై ఆరోపణలు వచ్చిన కేసుల్లో సీసీకెమెరాల ఫుటేజీలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా పోలీసులకు మచ్చతెచ్చే ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కోర్టులు సీసీకెమెరాల ఫుటేజీలను అడుగుతున్నా.. స్పందన శూన్యం.
ఈ కేసుల్లో ఏం జరిగిందంటే..
2021 జూన్‌లో యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు చోరీ కేసులో అరెస్టు చేసిన దళిత మహిళ మరియమ్మ కస్టడీలో మరణించారు. ఆ కేసులో కోర్టు సీసీకెమెరా ఫుటేజీని సమర్పించాలని ఆదేశించగా ఆ ఫుటేజీ లేదని పోలీసులు సమాధానమిచ్చారు. కేబుల్ పనుల కోసం పోలీస్ స్టేషన్‌లో 20 రోజులపాటు సీసీ కెమెరా రికార్డింగ్ నిలిపివేసినట్లు వివరించారు.
దిశ కేసులోనూ..
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం కలిగించింది. ఎన్‌కౌంటర్ కేసులోనూ షాద్‌నగర్ ఠాణాలో సీసీ కెమెరా ఫుటేజీ లేదని విచారణ కమిషన్‌కు పోలీసులు తెలియజేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు నీతీశ్ కస్టోడియల్ డెత్ కేసులో కూడా.. ఠాణాలోని సీసీ కెమెరాల ఫుటేజీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళను అర్ధరాత్రి ఠాణాకు ఈడ్చుకొచ్చి, థర్డ్‌డిగ్రీతో హింసించారనే ఆరోపణలున్నాయి. సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు.. ఎల్‌బీనగర్ చౌరస్తా నుంచి ఠాణా వరకు, ఠాణాలోని సీసీ కెమెరాల ఫుటేజీని అందజేయాలని ఆదేశించింది. అయితే.. పోలీసులు ఏం వివరణ ఇస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.
వాళ్లకు అవసరం అనుకుంటేనే..
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలున్నాయి. ఏటా డీజీపీ నిర్వహిం చే వార్షిక ప్రెస్‌మీట్‌లోనూ ఈవిషయాన్ని చర్వితచర్వణంగా చెబుతున్నారు. అయి తే.. చాలా ఠాణాల్లో ఎంట్రన్స్ వద్ద, రిసెప్షన్, హాలు ఇలా కొన్నిప్రాంతాల్లో మాత్ర మే సీసీ కెమెరాలు ఆన్‌లో ఉంటున్నాయి. స్టేషన్ హౌస్ అధికారి(ఎస్ హెచ్‌వో) గది లో, ఎస్సైల చాంబర్లలో మాత్రం కెమెరా లు అవసరాన్ని బట్టిమాత్రమే పనిచేస్తుంటాయనేది బహిరంగ రహస్యం.
ఫుటేజ్ లేదట?!
ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ స్థానిక నేత హంగామా చేశారు. అయితే సీసీకెమెరా లేకపోవడంతో అతనికి వ్యతిరేకంగా ఆధారం లేకుండా పోయింది. కొన్ని అవినీతి కేసుల్లో సీసీ కెమెరా రికార్డింగ్స్ కీలక ఆధారాలుగా ఏసీబీకి ఉపయోగపడ్డాయి. లంచం తీసుకుంటున్న సీన్లు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఫుటేజీని డిజిటల్ ఎవిడెన్స్‌గా కోర్టులకు సమర్పించారు. సీసీ కెమెరాలు పనిచేయక పోతే.. తక్షణం మరమ్మతులు చేయించకుండా తాత్సారం వహించడం వెనుక మతలబు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.