Suryapet: సర్కారీ కొలువంటే ఠంచన్ గా జీతం వస్తుంది. డీఏ, పిఆర్సి ఇందుకు అదనం. పైగా పని చేసినా, చేయకున్నా అడిగే వారు ఉండరు. ప్రభుత్వం ఏమైనా ఒత్తిళ్లు తీసుకొస్తే ప్రశ్నించేందుకు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పనిమీద కార్యాలయానికి వస్తే పైసలు ఇస్తే గాని చేసే పరిస్థితి ఉండదు. అంటే ఎలా చూసుకున్నా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే ఆమ్దానీ ఎక్కువే. ఇప్పటికీ మెజారిటీ ఉద్యోగులు లంచగొండులే. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వెరవడం లేదు. మొన్నటికి మొన్న అవినీతి కేసులో ఇరుక్కుపోయి భర్తను కోల్పోయి, చివరకు తాను కన్నుమూసిన అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ ఉదంతం ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలిగించడం లేదు. అందుకే అవినీతికి పాల్పడుతున్న అధికారుల జాబితాలో తెలంగాణ తొలి పది స్థానాల్లో ఉండటం గమనార్హం.
ఈయన తులసి మొక్క
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో చిలక రాజు నరసయ్య రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే నరసయ్య ఉత్తమ ప్రభుత్వ అధికారిగా పలుమార్లు పురస్కారాలు అందుకున్నారు. పేద కుటుంబం నుంచి అంచలంచెలుగా కష్టపడి ఆర్ఐ స్థాయి దాకా వచ్చిన నరసయ్య కు పేదరికం వల్ల కలిగే నష్టాలు, లంచం ఇవ్వడం వల్ల వచ్చే ఇబ్బందులు తెలుసు. అందుకే ఆయన ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు. రెవెన్యూ శాఖలో చిన్నపాటి ఉద్యోగం చేసేవారే లక్షలకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో.. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నరసయ్య తన కార్యాలయానికి వస్తారు. పైగా తన జేబుకు నాకు లంచం వద్దు అంటూ ఐడి కార్డు తగిలించుకుంటారు. మొదట్లో సహచర ఉద్యోగులు, అక్కడికి వచ్చిన వారంతా నరసయ్య వ్యవహారం చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తహసిల్దార్ శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు.
bribe
దీంతో స్పందించిన ఆమె.. ఐడి కార్డు పెట్టుకుని, విధులు నిర్వహించడం సరికాదని సూచించారు. ” నువ్వు ఒక్కడివే సుద్ద పూసవా? అందరం లంచం తీసుకుంటామా” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినా ఐడి కార్డు తీసేందుకు నరసయ్య ఒప్పుకోలేదు. ” ఎవరు ఎన్ని చెప్పినా, ఎలాంటి వేధింపులకు గురిచేసినా, ఒత్తిళ్లకు పాల్పడినా, ఐడి కార్డు తీసేందుకు నేను ఒప్పుకోను అంటూ” నరసయ్య స్పష్టం చేశారు. నేను లంచం తీసుకోను. ఐడి కార్డు పెట్టుకునే విధులు నిర్వహిస్తానంటూ తెగేసి చెప్పారు. దీంతో రెవెన్యూ కార్యాలయంలోని ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు.
అటెండర్ నుంచి ఇక్కడ దాకా
ముందే చెప్పుకున్నట్టు నరసయ్యది పేద కుటుంబం. ఆయన రెవెన్యూ శాఖలో అటెండర్ గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగారు. దేవరకొండ, డిండి, హుజూర్నగర్, మఠంపల్లి కలెక్టరేట్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అక్కడ పనిచేసినప్పుడు ఏ ఒక్కరి దగ్గర కూడా రూపాయి లంచం తీసుకోలేదు. పైగా చేసిన ప్రతి పని కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే పూర్తి చేశారు. ఎక్కడ కూడా ఆశ్రితపక్షపాతం చూపించలేదు. ఆయన పనితీరు మెచ్చే నల్గొండ జిల్లాలో పని చేస్తున్న కలెక్టర్లందరూ నరసయ్య పై ప్రత్యేక అభిమానం చూపించేవారు. ఇప్పటికీ ఆయనతో మాట్లాడుతూనే ఉంటారు. . కాగా ఈ తరహా ఐడి కార్డు ధరించి విధుల్లోకి రావద్దని తనకు రెవెన్యూ శాఖ ఉన్నత అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని నరసయ్య చెబుతున్నాడు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా తాను కార్డు ధరించే విధులకు హాజరవుతానని నరసయ్య చెబుతుండడం గమనార్హం.