TSRTC: వచ్చే ఐదు నెలలు కీలకం.. ఆర్టీసీకి సజ్జనార్‌ పెట్టిన టార్గెట్ ఏంటి?

రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ ఆదేశించారు.

Written By: Raj Shekar, Updated On : September 24, 2023 8:54 am

TSRTC

Follow us on

TSRTC: టీఎస్‌ ఆర్టీసీ… రెండేళల క్రితం వరకు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడిన సంస్థ. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ వచ్చాక పరిస్థితి క్రమంగా మారుతూ వస్తోంది. సజ్జనార్‌ సంస్కరణలతో నష్టాల్లో ఉన్న డిపోలు లాభాల బాట పట్టాయి. కార్గొ సర్వీస్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. తాజాగా ఆన్‌లైస్‌ సర్వీస్‌లు విస్తృతం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే పండుగల సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.

సిబ్బందికి కీలక సూచన..
రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌ ఆదేశించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు. పండుగ సీజన్‌ సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, తలెత్తుతున్న సమస్యలు, తదితర అంశాలపై హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి ఉద్యోగులందరితో శనివారం ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కీలక సూచనలు..
ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వంలో విలీనం చేయడంతో సిబ్బంది బాధ్యత మరింత పెరిగిందని, గతం కంటే రెట్టింపు స్థాయిలో పని చేయాలన్నారు. రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని, వినూత్న కార్యక్రమాలతో ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేశామని తెలిపారు. సంస్థ మనుగడ కోసం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను అటు సిబ్బంది, ఇటు ప్రయాణికులు స్వాగతించారని పేర్కొన్నారు.

వంద రోజుల ఛాలెంజ్‌ సక్సెజ్‌..
వంద రోజుల ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్, రాఖీ పండుగ ఛాలెంజ్, దసరా ఛాలెంజ్, సంక్రాతి ఛాలెంజ్, ఏడీపీసీ ఛాలెంజ్‌… ఇలా ఎన్నింటినో సిబ్బంది సవాలుగా స్వీకరించి లక్ష్యానికి మించి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పని చేయడం వల్లే సంస్థకు సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.

ముందస్తు బుకింగ్‌..
పండుగల సీజన్‌కు సంబంధించి ముందస్తు టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ఆర్టీసీలో తొలిసారి ప్రవేశపెట్టారు. పండుగల సీజన్‌లో టికెట్‌చార్జీల పెంపును నిలిపి వేసిన సజ్జనార్‌.. ప్రయాణికులకు ఉపశమనం కల్పించారు. అయితే ఈ ప్లాన్‌ వర్కవుట్‌ అయింది. చార్జీలు పెంచకుండానే పండుగల వేళ భారీగా ఆదాయం రాబట్టారు. దీంతో ప్రైవేటు సంస్థల తరహాలో తాజాగా ఆర్టీసీలోనూ ముందస్తు బుకింగ్‌ సదుపాయం తీసుకువచ్చారు. పండుగల సమయంలో అప్‌ అండ్‌ డౌట్‌ టికెట్‌ బుకింగ్‌ ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం కల్పించారు. ముందస్తుగా బుక్‌ చేసుకుంటే పది శాంత రాయితీ కూడా ఇస్తున్నారు. ఇంకే ముందు.. అదిరిపోయే ఆర్టీసీ ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. పండుగల వేళ ఊళ్లకు వెళ్లేవారు టికెట్లు హాట్‌ కేకుల్లా బుక్‌ చేసుకుంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సర్వీస్‌లు పెంచేందకు కూడా ఈ ముందస్తు బుకింగ్‌ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రాబోయే ఐదు నెలల్లో భారీ టార్గెట్‌నే ఆర్టీసీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.