Homeజాతీయ వార్తలుMunugode By Election 2022: ఓట్లు చెబుతున్న లెక్కలేంటి.. టీఆర్‌ఎస్‌ అనుమానమే నిజమైందా!!

Munugode By Election 2022: ఓట్లు చెబుతున్న లెక్కలేంటి.. టీఆర్‌ఎస్‌ అనుమానమే నిజమైందా!!

Munugode By Election 2022: ముగిసిన మునుగోడు ఎన్నికలు.. ఆయా పార్టీలకు పోలైన ఓట్లు.. అనేక చర్చలకు కారణమౌతున్నాయి. ఉత్కంఠ పోరులో టీఆర్‌ఎస్‌ గెలిచింది. 10,309 ఓట్ల తేడాతో కారు దూసుకెళ్లింది. మునుగోడులో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాజగోపాల్‌రెడ్డి బలమే పార్టీ బలంగా మారింది. కాంగ్రెస్‌ కు వచ్చిన ఓట్లు రాజగోపాలరెడ్డిని దెబ్బ తీశాయి. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా దక్కలేదు. టీఆర్‌ఎస్‌ – బీజేపీ – కాంగ్రెస్‌ తరువాత బీఎస్పీ నాలుగో స్థానంలో నిలిచింది. అన్ని శక్తులతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీఎస్పీ 4,145 ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగింది. కాంగ్రెస్‌ మరింత బలహీనపడింది. బీఎస్పీ నాలుగోస్థానంలో నిలిచి ఆసక్తిరేపింది. బీఎస్పీ అభ్యర్ధి అందోజు శంకరాచారి బరిలో నిలిచారు.

Munugode By Election 2022
Munugode By Election 2022

వివాదాస్పద గుర్తులకు మంచి ఓట్లే..
ఇక, మునుగోడుర ఉప ఎన్నికల ముందు వివాదానికి కారణమైన చపాతీ మేకర్, రోడ్‌ రోలర్, చెప్పులు, డోలీ, కెమెరా, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులకు పోలైన ఓట్లు ఇప్పుడు మరోసారి ఆసక్తిగా కనిపిస్తోంది. మరమొని శ్రీశైలం యాదవ్‌కు ఎన్నికల సంఘం చపాతి మేకర్‌ గుర్తు కేటాయించింది. ఎన్నికల్లో ఆయనకు 2,407 ఓట్లు పోలయ్యాయి. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌ రోడ్డు రోలర్‌ గుర్తుపై పోటీ చేశారు. ఆయనకు 1,874 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి, విశారదన్‌ మహారాజ్‌ బలపరిచిన ఇర్పుల గలయ్య(చెప్పుల జోడు)గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో నిలిచే కేఏ.పాల్‌ మునుగోడులో 805 ఓట్లు సాధించారు. ఓవరాల్‌గా మూడు వివాదాస్పద గుర్తులకు కలిపి 6,551 ఓట్లు వచ్చాయి. ఈ గుర్తులు లేకపోయి ఉంటే తమ మెజార్టీ మరింత పెరిగేదని వాదిస్తోంది టీఆర్‌ఎస్‌. తమ గుర్తును పోలిన ఓట్లు లేకపోయి ఉంటే తమ అభ్యర్ధి మెజార్టీ మరింత పెరిగేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు స్పష్టం చేశారు. అదే సమయంలో తమ విజయం ఆపటం బీజేపీ నేతలకు సాధ్యపడలేదని.. కానీ, మెజార్టీ తగ్గించటంలో మాత్రం సక్సెస్‌ అయ్యారని వ్యాఖ్యానించారు.

ఎన్నికలకు ముందు వివాదం..
ఎన్నికల ముందు స్వతంత్ర అభ్యర్ధులకు గుర్తుల కేటాయింపు విషయంలో పెద్ద వివాదమే జరిగింది. వీటిౖపై టీఆర్‌ఎస్‌ కోర్టును ఆశ్రయించింది. తొలిగించాలని ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ, చివరకు ఈ గుర్తులు బ్యాలెట్‌లో అలాగే ఉన్నాయి. దాదాపు ఆరు వేలకు పైగా ఓట్లు ఈ గుర్తులకు పోలయ్యాయి. కానీ, ఈ వాదనతో బీజేపీ విభేదిస్తోంది.
కలిసొచ్చిన కమ్యూనిస్టుల పొత్తు.

Munugode By Election 2022
Munugode By Election 2022

 

మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి కమ్యూనిస్టుల పొత్తు కలిసి వచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ కమ్యూనిస్టులు మద్దతు లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది అని విశ్లేషకులతోపాటు గులాబీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు మంచి బలం ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది వామపక్ష పార్టీల అభ్యర్థులే. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లి ఉంటే పోటీ మరింత ఉత్కంఠగా మారేది. ఈ విషయంలో కేసీఆర్‌ ముందస్తుగా చొరవ తీసుకొని వేసిన ఎత్తుగడ కలిసి వచ్చింది. ఇన్ని సమీకరణాల నడుమ టీఆర్‌ఎస్‌ గెలుపుతో.. తెలంగాణలో భవిష్యత్‌ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version