Congress Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ.. ఒకవైపు ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ ఎమ్మెల్యేల్లో జరుగుతుంటే.. మరోవైపు కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయన్న చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. నేడో రేపో సీఎం ఎవరన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మంత్రులు ఎవరవుతారు.. సీఎం అభ్యర్థి ఎవరికి ప్రాధాన్యం ఇస్తాడు అనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
6 లేదా 9న ప్రమాణ స్వీకారం..
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఈనెల 6 లేద 9వ తేదీన కొలువుదీరే అవకాశం ఉంది. దీంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఒకేసారి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ పడుతున్నా.. రేవంత్, భట్టి మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశం ఉంటుంది.
సామాజికవర్గాల సమీకరణ..
సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రత్యేకించి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవంతోపాటు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు, గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రి పదవులకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
కొత్త వారికి నో ఛాన్స్..
మొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టిన వారికి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పేర్లను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఈయనకు అవకాశం ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. జీవన్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. పొన్నం ప్రభాకర్‌కు ఛాన్స్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా, కరీంనగర్ నుంచి నలుగురు మంత్రులు అయ్యారు. కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఈటల రాజేందర్‌కు మంత్రి పదవులు ఇచ్చింది. ఈ కోణంలో ఆలోచిస్తే, పన్నంకు అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్‌కు కరీంనగర్‌లో తక్కువ సీట్లు వచ్చినందున, పొన్న తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో ఛాన్స్ దక్కకపోవచ్చని తెలుస్తోంది.
– ఇక మైనార్టీ వర్గం నుంచి పోటీ చేసిన అందరూ ఓడిపోయారు. ఈ నేపథ్యంలో షబ్బీర్‌అలీని మంత్రివర్గంలోకి తీసుకొని మండలికి పంపుతారనే ప్రచారం జరుగుతోంది. మెదక్ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పేరు ఖరారైనట్లే. ఈ జిల్లా నుంచి మరొకరికి అవకాశం తక్కువే.
– మహబూబ్నగర్ నుంచి రేవంత్‌రెడ్డిని మినహాయిస్తే.. జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతోపాటు షాద్‌నగర్ నుంచి గెలిచిన శంకర్ పేరును కూడా పరిశీలించవచ్చని తెలుస్తోంది.
– రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మెహన్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశం ఉంది.
– నల్గొండ జిల్లా నుంచి సీనియర్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రివర్గం రేసులో ఉన్నారు. ఉత్తమ్ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది.
– ఇక వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు పోటీ పడుతున్నారు.
స్పీకర్ ఎవరో?
మంత్రివర్గ కూర్పు ఇలా ఉంటే.. స్పీకర్ ఎవరు అన్న అంశంపేనా చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ఉన్న పోటీని పరిగణనలోకి తీసుకొని తుమ్మల పేరును స్పీకర్ స్థానానికి పరిశీలించే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.