BRS Dissident Leaders: నమ్ముకుని వస్తే టికెట్ దక్కలేదు. పార్టీలో సముచిత స్థానం దక్కలేదు. రేపటి నాడు ఇంకెంత దిగజారాల్సి వస్తుందో. అధినేతను కలుసుకొని పరిస్థితిని వివరిద్దామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు.. ఇటు చూస్తే అనుచరులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రత్యామ్నాయ వేదిక వైపు వెళ్లి పోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నేతల పరిస్థితి గోటు చుట్టూ రోకటి పోటు లాగా మారింది. భారత రాష్ట్ర సమితిలో ఉండాలంటే మనసు ఒప్పడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లాలంటే ప్రజలేమనుకుంటున్నారన్న భయం నిలువనీయడం లేదు.. ఇప్పుడేం చేయాలో వారికి అంతు పట్టడం లేదు. పరిస్థితిని తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కొంతమంది పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిస్తే.
కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కెసిఆర్ ను నమ్ముకుని ఈయన పార్టీలోకి వస్తే ఈయనకు ఆశించినంత ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ఆయన కూడా అసంతృప్తి రాగాన్ని అందుకున్నారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భారత రాష్ట్ర సమితిలో రాజరిక ధోరణి నడుస్తోందంటూ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు రాజకీయ భవిష్యత్తు కూడా సందిగ్ధంలో పడింది. టిడిపిలో మంత్రిగా వ్యవహరించిన మోత్కుపల్లి.. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పుడు ఆలేరు లేదా మరోచోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని.. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మరో పదవి అయినా ఇస్తామని కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చారు. హుజరాబాద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్.. మోత్కుపల్లికి సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం అమలుపై ఆయనతో చర్చించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత మోత్కుపల్లి ఎక్కడా తెరపై కనిపించలేదు. వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పేరు కూడా జాబితాలో లేదు. వేరే పదవి ఇచ్చే అంశంపై అధిష్టానం స్పందించడం లేదు. దీంతో ఆయన దారి ఇప్పుడు ఏంటి అనే ప్రశ్న నెలకొంది. ఇక కేసీఆర్ ను నమ్ముకొని పార్టీలోకి వస్తే.. మోసం చేశారంటూ ఇటీవలే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరావును పార్టీ బలోపేతం కోసం అంటూ భారత రాష్ట్ర సమితిలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవిన్ఇచ్చి మరీ మంత్రిని చేశారు. 2016 ఉప ఎన్నికల్లో పాలేరు స్థానంలో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు.. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటినుంచి భారత రాష్ట్ర సమితిలో తుమ్మలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ సమయంలో తన దూతగా తుమ్మల వద్దకు మంత్రి హరీష్ రావును తుమ్మల నాగేశ్వరరావు పంపించారు. పలు హామీలు ప్రకటించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు కెసిఆర్ పట్టించుకోలేదు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి మండల వెంకటేశ్వర పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఇక టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న తుమ్మల వద్దకు ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావును పంపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక కేసీఆర్ చేసిన మోసాన్ని తట్టుకోలేకనే శుక్రవారం తుమ్మల నాగేశ్వరరావు బల ప్రదర్శన చేశారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పార్టీలోకి చేర్చుకున్న స్వామి గౌడ్, దాసోజు శ్రావణ్ లలో కేవలం శ్రావణ్ ఒక్కరికే ఎమ్మెల్సీ పదవి దక్కింది. గతంలో తనకు ప్రాధాన్యం దక్కలదంటూ భారత రాష్ట్ర సమితి నుంచి విడిపోయి బిజెపిలో చేరిన స్వామి గౌడ్.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరిగి భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో అంతు పట్టకుండా ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 2014లో భారత రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి గెలుపొందిన జలగం వెంకట్రావుకు ఈసారి కొత్తగూడెం స్థానం దక్కలేదు. ఇప్పుడు ఆయన దారి ఎటు అనేది చర్చనీయాంశంగా ఉంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో తిరుగుబావుట ఎగరేశారు. ఆవిరి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ కూడా పునరాలోచనలో పడ్డారు. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకుల్లో బొమ్మెర రామ్మూర్తికి కెసిఆర్ ఈసారి కూడా మొండిచేయి చూపించారు.. పటాన్ రువు అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని ఆశించిన నీలం మధు ముదిరాజ్ కి కూడా భంగపాటే ఎదురయింది. వీరంతా ప్రత్యామ్నాయ వేదికల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.