CM Jagan: జగన్ సర్కారు పఠించేది ఎప్పుడు బీసీ జపం. కానీ పార్టీలో, ప్రభుత్వంలో కీ రోల్ మాత్రం రెడ్డి సామాజికవర్గానిదే. కీలక పదవులు, ఆదాయం వచ్చే కొలువులు అన్నీ ఆ సామాజివర్గానికి చెందిన వారికే కట్టబెడుతున్నారు. చివరకు సలహాదారుల్లో సైతం సింహభాగం వారిదే. బ్యూరోక్రట్ల వ్యవస్థలోనూ వారికే పెద్దపీట. చివరకు ఎమ్మెల్సీ స్థానాల్లో సైతం రెడ్డి సామాజికవర్గం వారే ఉండాలని జగన్ ఆరాటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక వర్గాల్లో ముందుండేది ఉపాధ్యాయులే. అందుకే ఆ వర్గాల నుంచి తమ సామాజికవర్గం వారు ఉంటే ప్రతికూలత తగ్గించుకోవచ్చన్నది జగన్ ఆలోచన. అటు పట్టభద్రుల నియోజకవర్గాల్లో సైతం గెలుపొంది యువతలో తన బలం తగ్గలేదని నిరూపించుకోవడానికి డిసైడ్ అయ్యారు. అయితే కనీసం ఎవరితో చర్చించకుండా పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల సమక్షంలో ఏకంగా ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. వీరి గెలుపునకు కృషిచేయండి అంటూ అల్టిమేట్ జారీచేశారు.
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పార్టీలో నిర్ణయించి అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది. కానీ జగన్ ఏకపక్షంగా సమావేశంలో పేర్లు వెల్లడించేసరికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు షాక్ కు గురయ్యారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎం.వి. రామచంద్రారెడ్డి , తూర్పు రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్లును ప్రకటించేసరికి ఏంటి అంతా రెడ్లేనా అన్న గుసగుసలు వినిపించాయి. చివరాఖరుకు ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుగానే డిసైడ్ అయిన సీతంరాజు సుధాకర్ ను ప్రకటించేసరికి ఇందులో కొత్తదనం ఏముందన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది.
ఇప్పుడు ప్రకటించిన ఐదుగురులో నలుగురు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. మరొకరు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్. అంటే రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలు లేరన్న రీతిలో జగన్ ఏకపక్షంగా తన సామాజికవర్గానికి చెందిన వారి పేర్లుతో చాలా సంతృప్తిగా కనిపించారు. త్వరలో మరో ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ప్రకటించే అవకాశం ఉంది. అందులో కూడా అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తామని చెప్పకనే చెప్పారు. లేకుంటే ఒకటి రెండు బీసీలకు ఇచ్చి అదే ప్రచారం చేసుకుందామని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఉపాధ్యాయ, పట్టభద్రుల సీట్లకు మాత్రం బీసీలు పనికిరారన్నట్టు డిసైడ్ అయిపోయారు. అయితే ఈ నిర్ణయం పార్టీ వర్గాలకే మింగుడు పడడం లేదు. కానీ ఎవరూ బయటపడేందుకు సాహసించడం లేదు.
అయితే ఇప్పుడు జగన్ చెబుతున్న క్లాస్ వార్ చర్చనీయాంశంగా మారుతోంది. తాము పెత్తందార్లతో పోరాటం చేస్తున్నామని చెప్పుకొస్తున్న జగన్ ఇలా తన సామాజికవర్గాన్ని పెద్దపీట వేస్తుండడం దేనికి సంకేతం. పేరుకో.. పేపరు ప్రకటనకో పనికొస్తున్న సామాజిక న్యాయం ఇక్కడ పనికిరాలేదా? అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. పార్టీలో పనిచేస్తున్న వారిని కాకుండా సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేస్తుండడం ఇతర వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. తాము ఏంచేసినా ఆ వర్గాలను సర్దిచెప్పి ఓట్లు వేయించుకోవచ్చని జగన్ డిసైడ్ అయినట్టున్నారు. అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఇష్టరాజ్యంగా తనవారితో నింపేస్తున్నారు.