Santhal Tribe- Draupadi Murmu: ఒక వ్యక్తికి వచ్చే కోపం.. ఓ వంద మందికి వస్తే ఆగ్రహం.. అదే ఓ తెగలో ప్రజ్వరిల్లితే ఉద్యమం.. ఆ ఉద్యమమే చినికి చినికి గాలి వాన అయింది. గరక పోచలన్నీ కలిసి మద్దపుటేనుగుని బంధించినట్టు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ధిక్కరించాయి. 200 సంవత్సరాల పరాయి పాలన అంతానికి నాంది పలికాయి. బందూకులు లేవు. అధునాతన బుల్లెట్లు లేవు. మర ఫిరంగులు లేవు. సాయుధ బలగాలు లేవు. కానీ గుండె ధైర్యంతో, ఉక్కు పిడికిళ్ళతో, రగిలే నెత్తురుతో బ్రిటిష్ పాలన అంతానికి కంకణం కట్టుకున్నారు. ఇంతకీ ఎవరు వారు? దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే వారికి ఆంగ్లేయులతో ఎందుకు గొడవ వచ్చింది? ఆ గొడవ ఎంత దాకా దారి తీసింది? చివరకు ఏం జరిగింది?
పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు
వ్యాపారం పేరుతో భారతదేశంపై కాలుమోపిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. వ్యాపారం వదిలేసి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది.. సాయుధ బలగాలను ఇక్కడికి దింపింది. విలువైన వనరులను తమ దేశానికి తరలించింది. అప్పట్లో భారతదేశంలో సామంత రాజ్యాలు ఉండేవి. రాజుల మధ్య ఉన్న అనైక్యతను బ్రిటిష్ వాళ్లు సొమ్ము చేసుకునేవారు. “విభజించి పాలించు” అనే విధానంతో వారిలో వారికి తగాదాలు పెట్టి రాజ్యాలను హస్తగతం చేసుకునేవారు. ప్రజలను చిత్రవధకు గురి చేసేవారు. బ్రిటిష్ సైనికుల ఆగడాలకు ఎంతోమంది యువతులు, మహిళలు తమ మాన, ప్రాణాలను కోల్పోయేవారు. ఎదురు తిరిగే పురుషులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చేవారు. సహజ సంపదకు పుట్టినిల్లయిన భారతదేశాన్ని వాళ్లు నిలువునా దోచుకున్నారు. ఈ క్రమంలోనే దట్టమైన అడవుల పై వారి కన్నుపడింది. ఇక్కడే సంథాలి తెగ గిరిజనులకు, ఆంగ్లేయులకు గొడవ మొదలైంది.
Also Read: Governor Tamilisai: ఆకాశంలోనూ గవర్నర్ చేసిన మంచి పని ఏంటో తెలుసా?
ద్రౌపది ముర్ము పూర్వికులు వారే
సంథాలి తెగ గిరిజనులు ఒకప్పటి బీహార్ ప్రాంతంలోని జార్ఖండ్ లో దట్టమైన అటవీ ప్రాంతంలో నివసించేవారు. పోడు వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వీరి ప్రధాన వృత్తులు. సహజ సంపదకు నిలయమైన ఈ అడవుల పై ఆంగ్లేయుల కన్ను పడింది. ఇంకేముంది ఆ ప్రాంతంలో ఉన్న సామంత రాజును తమ బంధిగా చేసుకున్నారు. తర్వాత మిడతల దండు లాగా జార్ఖండ్ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత మెల్లగా అడవుల్లోకి చొచ్చుకు వెళ్లారు. వట వృక్షాలను నిలువునా నరికేశారు. ఆ కలపను తమ దేశానికి తరలించారు. వృక్షాలు నరికిన ప్రాంతంలో రబ్బరు మొక్కలు, కాఫీ మొక్కలు నాటారు. దీనివల్ల జంతువుల సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. నాగరిక సమాజానికి దూరంగా ఉండే సంథాలి తెగ గిరిజనులకు ఇది శరాఘాతంగా పరిణమించింది. పైగా సంథాలి తెగకు చెందిన గిరిజన మహిళలను ఆంగ్లేయులు చెరచడం ప్రారంభించారు. ఇది ఆ జాతికి చెందిన పురుషుల్లో ఆగ్రహానికి కారణమైంది. వెంటనే తలోదిక్కు పారిపోయారు.
అడుగులే ఉద్యమశాలలు
అసలే గిరిజనులు.. అటవీ ప్రాంతంలో అణువణువు తెలిసినవారు. పైగా తమకు అమ్మ లాంటి అడవి పై ఆంగ్లేయులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే పోరాటానికి సంథాలి తెగ ప్రజలు నడుం బిగించారు. బాణాలు, విల్లంబులతో బ్రిటిష్ సైనికులను దొంగ దెబ్బ తీసేవారు. వారి ఆయుధాలను తస్కరించేవారు. పన్నుల పేరుతో వేధించే ఆంగ్లేయుల పై దాడి చేసి చంపేసేవారు. స్వాతంత్ర పోరాటంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం భారతదేశ 15వ రాష్ట్రపతిగా గెలిచిన ద్రౌపది ముర్ముకు సంథాలి తెగ గిరిజనులు పూర్వికులు అవుతారు. ప్రస్తుతం భారత్ 75వ స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ.. స్వాతంత్రం అనంతరం జన్మించిన తమ తెగకు చెందిన ఒక మహిళ దేశ ప్రథమ పౌరురాలు అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా స్వాతంత్ర పోరాటానికి లభించిన గౌరవమని సంబరపడుతున్నారు.
Also Read:Modern Love Hyderabad Review: రివ్యూ : మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్