CM KCR- Governor Tamilisai: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లడం లేదు. గవర్నర్ ను కూడా అసెంబ్లీకి ఆహ్వానించడం లేదు. బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ముగించారు. దీనిపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీఎం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి కోరినా గవర్నర్ ఆ ఫైల్ ను దూరం పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయని చెబుతున్నారు. ఈ క్రమంలో గవర్నర్, సీఎం మధ్య పొరపొచ్చాలు పెరిగాయి. ఫలితంగా రాజ్ భవన్ కు కేసీఆర్ రావడం మానేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరు కూడా రాజ్ భవన్ వైపు రావడం లేదు.
Also Read: CM Jagan Three Capital Issue: మూడు రాజధానులతో జగన్ మళ్లీ గెలుస్తారా?
ప్రస్తుతం ఉగాది పండుగ రానుండటంతో రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిపై గవర్నర్ సీఎంతోపాటు అందరికి ఆహ్వానాలు పంపారు. వేడుకలకు రావాల్సిందిగా కోరారు. ఆడబిడ్డ ఆహ్వానిస్తే అన్నలు రాకుండా ఉంటారా? లేక ఇంకా తమలోని విద్వేషాలు పెంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలు మరిచిపోయి కొత్త విషయాలు పట్టించుకుందామని గవర్నర్ ఆకాంక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గవర్నర్ తో విభేదాలకు స్వస్తి పలికి రాజ్ భవన్ కు వెళతారా? లేక తనలోని ఆగ్రహాన్ని ఇంకా పెంచుకుని అభాసు పాలవుతారా అనేది తేలాల్సి ఉంది. కేసీఆర్ ఎవరిపైనైనా కోపం పెంచుకుంటే ఇక వారి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడరని తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల చినజీయర్ స్వామితో వచ్చిన విభేదాల కారణంగా ఆయనను పక్కన పెట్టిన సంగతి మనకు సుపరితితమే. దీంతో ఉగాది వేడుకలను ఉపయోగించుకోవాలని చూస్తున్న గవర్నర్ కోరిక నెరవేరుతుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.