Indiramma Houses scheme
Indiramma Houses scheme: అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు తెలంగాణ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం రేవంత్ రెడ్డి నారాయణ పేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించారు. ఆ గ్రామంలో ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో పనులను అధికారులను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎలక్షన్ కోడ్ పూర్తయిన తర్వాత ప్రారంభిస్తారు.
ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున పక్కా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు పథకాలకు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. ఈ పథకాలకు మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సర్వేయర్లు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి విచారించారు. లబ్ధిదారులతో ప్రీ గ్రౌడింగ్ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుకి రూ.5 లక్షలను అందజేస్తుంది ప్రభుత్వం.
ఇందిరమ్మ ఇళ్ల కోసం జనవరిలో నాలుగు రోజుల పాటు గ్రామసభలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో ఇళ్లకు సుమారు లక్ష దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10వరకు బేస్ మెంట్ లెవల్ దాకా వర్క్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఈ పథకంపై ఇటీవల అన్ని జిల్లాల పీడీలకు ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ గైడ్లైన్స్లో మంజూరు పత్రాలు అందుకున్న 45 రోజుల్లోగా ఇళ్ల పనులు ప్రారంభించాలన్నారు. పునాదులు తీసి బేస్ మెంట్ పూర్తిగా నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రూ.1 లక్ష ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. రూ.5 లక్షలను బేస్ మెంట్ దశలో రూ.లక్ష, గోడలు కట్టిన తర్వాత రూ.1. 25 లక్షలు, ఇంటి స్లాబ్ పూర్తయ్యాక రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మరో రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు పథకం అమలుకు దశల వారీగా నిధులు మంజూరు చేయనుంది.