Ganta Srinivasa Rao: గంటా పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..

గంటా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. కానీ భీమిలి నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన కు కేటాయిస్తారని తెలుస్తోంది. దీంతో గంటా చూపు విశాఖ రూరల్ జిల్లా పై పడినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 29, 2023 6:01 pm

Ganta Srinivasa Rao

Follow us on

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహకర్త. ప్రజల నాడిని పట్టి బరిలో దిగుతారు. గెలుపు సక్సెస్ ను వంట పట్టించుకున్న నేత గంటా. ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనే చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గంటా గెలుపొందారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీలా పడ్డారు. కొన్నేళ్లపాటు యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారారు. దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ ప్రారంభమైంది.

గంటా భీమిలి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని వార్తలు వచ్చాయి. కానీ భీమిలి నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన కు కేటాయిస్తారని తెలుస్తోంది. దీంతో గంటా చూపు విశాఖ రూరల్ జిల్లా పై పడినట్లు తెలుస్తోంది. అనకాపల్లి,చోడవరం నియోజకవర్గాలపై ఫోకస్ పెంచినా అక్కడ బలమైన ఇన్చార్జిలు ఉన్నారు. దీంతో ఆయన చూపు మాడుగుల వైపు పడినట్లు తెలుస్తోంది.

మాడుగుల తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం. కానీ గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి ఆయనే బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టిడిపికి సరైన అభ్యర్థి లేకపోవడం వల్లే అక్కడ వైసీపీకి విజయం చేకూరుతుందన్న టాక్ ఉంది. అందుకే మాడుగుల లో ఎంట్రీ ఇచ్చి సౌండ్ చేయాలని గంటా చూస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గం అధికం. గంటా చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే గతంలో ఒకసారి కాపు సామాజిక వర్గానికి చెందిన కరణం ధర్మశ్రీ ఈ నియోజకవర్గ నుంచే గెలుపొందారు. అందుకే గంటా శ్రీనివాసరావు ఇక్కడ బరిలో దిగేందుకు సాహసం చేస్తున్నారు. తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గంలో టిడిపిలో వర్గ పోరు నడుస్తోంది. దీనికి బ్రేక్ వేయాలంటే గంటా లాంటి నేతను పంపించడమే మేలని టిడిపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే గంటా విషయంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. గంటాను విశాఖ నగర రాజకీయాలకు పరిమితం చేయాలని అయ్యన్న డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ నాయకత్వం ఆలోచన మాత్రం గంటాను మాడుగులకు పంపించాలని ఉన్నట్లు సమాచారం. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.