Telangana Contractors: ప్రభుత్వం కోటి ఎకరాల మాగాణి సృష్టించామని చెబుతోంది. గోదావరి నదికి కెసిఆర్ నడక నేర్పారని భారత రాష్ట్ర సమితి శ్రేణులు అంటున్నాయి. ఎవరు ఎలా చెప్పినప్పటికీ.. అంతిమంగా ఆ పనులు చేయాల్సింది కాంట్రాక్టర్లే. ఆ కాంట్రాక్టర్లు కూడా నిర్ణీత సమయంలో డబ్బులు వస్తేనే పనులు చేస్తారు. లేకపోతే అంతే సంగతులు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వ పెద్దలు తీసుకొస్తే పనులు చేయక తప్పని పరిస్థితి. కాని చివరికి డబ్బులు రావాల్సిందే. లేకుంటే ఆ సంస్థలు మనుగడ కొనసాగించలేవు. ప్రస్తుతం బంగారు తెలంగాణగా పేర్కొంటున్న రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలకు చేసిన పనులకు సంబంధించి బిల్లులు రావడం లేదు. మంత్రులను కలిసినా ఉపయోగం లేకుండా పోతోందని కాంట్రాక్ట్ సంస్థలు అంటున్నాయి.
సింహభాగం సంక్షేమానికి
రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పనులకు బిల్లులు విడుదల కావడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నిధులన్నీ వివిధ సంక్షేమ పథకాలకు వెళ్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల పనులు మందగించాయి. రాష్ట్రంలో మొత్తం 26 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. జూలై నాటికల్లా వీటికి రూ.13,599.87 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇందులో బిల్లులు సిద్ధమై, దాఖలు చేసి, టోకెన్ నంబర్లు కూడా ఇచ్చినవి రూ.9,758.20 కోట్ల దాకా ఉన్నాయి. బిల్లులు సమర్పించినవి రూ.3841.67 కోట్ల వరకు ఉన్నాయి. కాగా, బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. బకాయిల్లో అత్యధికం రూ.5,768.92 కోట్లు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలవే. కాళేశ్వరం ఎత్తిపోతలకు రూ.3679.95 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.1176 కోట్లు రావాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరుకు కేంద్ర విద్యుత్తు రుణ సంస్థ (పీఎఫ్ సీ, ఆర్‌ఈసీ)ల నుంచి రుణాలు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు.. ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి దాటిపోవడంతో కేంద్ర సంస్థలేవీ రుణాలు ఇవ్వడం లేదు.
ప్రధాన పథకానికి మాత్రమే అనుమతి ఉంది
ఇక కాళేశ్వరంలో రోజుకు రెండు టీఎంసీలు తరలించే ప్రధాన పథకానికి మాత్రమే అనుమతి ఉంది. రోజుకు ఒక టీఎంసీ అదనంగా
తరలించే పథకానికి అనుమతుల్లేవు. ప్రస్తుతానికి అనుమతులు వచ్చే అవకాశాలు కూడా లేవు. ‘పాలమూరుకు కీలకమైన రెండో దశ పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) సిఫారసు చేసింది. అయితే ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్) వివాదంలో ఉంది. దీనికి అనుమతి ఇవ్వలేమని, నీటి కేటాయింపుల వివాదం తేలాల్సిందేనని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55 వేల కోట్లు దాటింది. దీన్ని పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి నిధులు ఇవ్వాల్సిందే. ఇదివరకు ఎత్తిపోతల్లో ఎలక్ట్రో మెకానికల్ కాంపోనెంట్ల (మోటార్లు, పంపులు, పంప్ హౌస్, నీటిని తరలించే పైపులదాకా)కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్ సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) రుణాలి చ్చేవి. అయితే, కేంద్ర జలశక్తి శాఖ.. అనుమతి లేనివాటి జాబితాలో పెట్టడంతో వీటికి రుణాలు ఆగిపోయాయి. కాళేశ్వరంలాగే హెడ్‌లు మాత్రమే పూర్తిచేసి, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను దేవుడి దయకు వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భూ సేకరణకూ నిధుల్లేవు
ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యంత కీలకం భూ సేకరణే. ఇందుకు రూ.322 కోట్లు విడుదలవాల్సి ఉంది. పునరావాసానికి రూ.224 కోట్లు ఇవ్వాల్సి ఉంది. భూ సేకరణకు సకాలంలో నిధులివ్వకపోవడంతో భూములను వదులుకోవడానికి రైతాంగం సిద్ధంగా లేదు. భూసేకరణ, పునరావాసానికి నిధులిస్తేనే ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచగలమని అధికారులు చెబుతున్నారు. బకాయిల నేపథ్యంలో పనులు చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సబ్ కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది.