గతంలో ఎప్పుడూ లేని విధంగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. దేశంలో పలు రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు మహమ్మారి వల్ల భారీ నష్టాలపాలయ్యాయి. కేంద్రం ఇప్పటికే పలు రంగాలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు, కీలక ప్రకటనలు చేయగా కేంద్రం మరో ప్యాకేజీ విడుదలకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.
దీపావళి పండుగకు ముందే కేంద్రం ప్యాకేజీని విడుదల చేయనుందని సమాచారం. కేంద్రం పలు రంగాలకు ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగే విధంగా పథకాల అమలుకు సిద్ధమవుతోంది. కేంద్రం గతంలో ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 21 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్టీకీ క్యాష్ వోచర్ల ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు కేంద్రం ప్రయోజనాలను చేకూరుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ అవసరం అనుకుంటే మరో ప్యాకేజీని అమలు చేస్తామని చెప్పగా ఆతిథ్య, పర్యాటక రంగాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్యాకేజీ విడుదల కానుందని తెలుస్తోంది. 35,000 కోట్ల రూపాయలతో ఈ ప్యాకేజీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేంద్రం ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు డిమాండ్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్యాకేజీలను అమలు చేస్తోంది.
కరోనా విజృంభణ వల్ల పర్యాటక, ఆతిథ్య రంగాలకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ రంగాల్లో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.