AP BJP: దేశ వ్యాప్తంగా ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి… ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదు. దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. కానీ ఏపీలో మాత్రం పట్టు దొరకడం లేదు. అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తున్నాఏపీకి వచ్చేసరికి మాత్రం ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతోంది ఆ పార్టీ. పొరుగున ఉన్న దాయాది రాష్ట్రం తెలంగాణలో పార్టీ బలోపేతమవుతోంది. ఇతర పార్టీల నాయకుల చేరికతో పాటు క్షేత్రస్థాయిలో పట్టు సాధిస్తోంది. అక్కడ అధికార బీఆర్ఎస్ కు సవాలే విసురుతోంది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీలో చేరికలు లేవు సరికదా.. ఉన్నవారు విభేదాలతో బయటకు వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ కలవరం చెందుతోంది. తక్షణ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

రాష్ట్ర బీజేపీలో మూడు వర్గాలున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఒకటి అధికార వైసీపీకి అనుకూల వర్గం… రెండోది టీడీపీ ఫేవర్ వర్గం.. మూడు పార్టీ విధేయ వర్గం. అయితే ఏపీలో బీజేపీ బలోపేతం కాకపోవడానికి బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్న వైఖరే కారణమన్న అపవాదు ఉంది. అధికార వైసీపీపై రాష్ట్రంలో పోరాటంచేయాలని పురమాయిస్తారు. కానీ జాతీయ స్థాయిలోజగన్ అండ్ కోకు పెద్దలు అనుకూలంగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎంతగా పోరాటం చేసినా ప్రజలు గుర్తించకపోవడానికి అదే రీజన్. ఇక ప్రధాన విపక్షం టీడీపీ విషయంలో కూడా సేమ్ సీన్. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అచీతూచీ వ్యవహరిస్తుంటారు. భవిష్యత్ లో పొత్తు ఉండదని కేవలం రాష్ట్ర నాయకులతో చెప్పిస్తారే కానీ.. ఢిల్లీ పెద్దలు అటువంటి సంకేతాలివ్వరు. అందుకే ఏపీ బీజేపీ రెండింటికీ చెడ్డ రేవడిలా మారిపోతోంది.
గత ఎన్నికల ముందు బీజేపీని ఎంత దెబ్బకొట్టాలో చంద్రబాబు అంతలా కొట్టేశారు. తానూ దెబ్బతిన్నారు. అప్పటి గుణపాఠాల నుంచి తేరుకోవాలే తప్ప.. ఇంకా ఏపీలో ప్రాంతీయ పార్టీలను పట్టుకొని రాజకీయాలను చేయాలని బీజేపీ హైకమాండ్ చేస్తోంది. ఎన్నికల నాటికి లాభ నష్టాలను భేరీజు వేసుకొని ఏదో ఒక పార్టీతో కలవాలని చూస్తోంది. ఇప్పటివరకూ మిత్రపక్షంగా ఉన్న జనసేనతో సఖ్యతగా మెలిగిన దాఖలాలు లేవు. హైకమాండ్ నుంచి స్పష్టత లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు తలోదారిలో వెళుతున్నారు. అవే పార్టీలో విభేదాలకు కారణమవుతున్నాయి.

తాజాగా బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని విడుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా ఆయన వర్గంగా భావిస్తున్న వారు వివిధ కారణాలు చూపుతూ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల వరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. హైకమాండ్ సోము వీర్రాజును ఎంపిక చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల సోము వీర్రాజు పార్టీ కార్యవర్గాలను మార్చారు. దీనిని సాకుగా చూపి కన్నా వర్గం పార్టీకి దూరమయ్యేందుకు డిసైడ్ అయ్యింది. జనసేనలో చేరడానికి ఆ వర్గమంతా నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ అప్రమత్తమైంది. అధిష్ఠాన దూతను పంపించింది. దీంతో కన్నా వర్గం కాస్తా శాంతించింది. అయితే ఏపీ విషయంలో హైకమాండ్ సీరియస్ గా దృష్టిపెట్టకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ హార్ట్ కోర్ అభిమానులు తేల్చిచెబుతున్నారు.