
Chandrababu- Jagan: తమిళనాడు తరహా రాజకీయాలు దేశంలో ఎక్కడా కనిపించవు. అధికారంలోకి వచ్చిన పార్టీ విపక్ష నేతను కటకటాలపాల్జేసే వరకూ నిద్రపోయేది కాదు. జయలలిత, కరుణానిధి దాదాపు రివేంజ్ రాజకీయాలే నడిపారు. కేసులతో ఇబ్బందులకు గురిచేయడం అక్కడ రాజకీయాల్లో రివాజుగా మారింది కూడా . అయితే అటు జయలలిత, ఇటు కరుణానిధి మరణం తరువాత అటువంటి వాతావరణానికి చెక్ చెప్పేందుకు సీఎం స్టాలిన్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. అవి వర్కవుట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే పొరుగన ఉన్న ఏపీకి ఆ రివేంజ్ రాజకీయాలు అంటుకున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసేందుకు ఎక్కువ ఆరాటపడుతున్నారు. అయితే ఈ తరహా రాజకీయాలు జగన్ ఎంట్రీ తరువాతే ప్రారంభమయ్యాయి.
ఆ చిన్న కారణంతోనే…
ఏపీలో సైద్ధాంతికంగా పోరాడే రాజకీయాలు ఏనాడో పోయాయి. ఇప్పుడంతా పగ, పగ, పగ అన్న సిద్ధాంతమే నడుస్తోంది. తాను జైలుపాలు కావడానికి చంద్రబాబే కారణమని జగన్ బలంగా నమ్మారు. నాడు తాను విభేదించడంతో పగపట్టి కాంగ్రెస్ పార్టీ జగన్ ను కేసుల్లో ఇరికించింది. అయితే ఈ కేసుల్లో ఉచ్చు బిగించింది మాత్రం చంద్రబాబే కారణమని జగన్ భావన. ఆ కేసుల్లో ఇంప్లీట్ అయ్యి కేసు బిగుసుకునేలా చేసింది చంద్రబాబు అండ్ కో కారణమని జగన్ భావిస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబును రాజకీయంగా దెబ్బకొట్టాలని డిసైడ్ అయ్యారు. దెబ్బకొట్టి మరీ అనుకున్నది సాధించుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులపై అదే పంథాను కొనసాగిస్తూ వచ్చారు. ఒక్క తన కేసుల విషయంలో చంద్రబాబు హస్తం ఉందన్న ద్వేషం తప్ప.. వారి మధ్య వ్యక్తిగత వైరమంటూ ఏదీ లేదు.
వారిద్దరిది తెరవెనుక స్నేహం..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రాజకీయ బద్ధ శత్రువులు. ఒకరిపై ఒకరు పదునైనా విమర్శనాస్త్రాలు సంధించుకునేవారు. కానీ అది రాజకీయం వరకూ మాత్రమే. తెర వెనుక మాత్రం వారు మంచి స్నేహితులు. ఒకరిని ఒకరు కాపాడుకునేంతటి స్నేహం వారిది. అధికారం మారినా వారి తెర వెనుక స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఒకరిపై ఒకరు కేసులు వేసుకునే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసినా.. ఏదో రూపంలో ఉపసంహరించుకునేలా చేసుకునేవారు. చివరకూ భూముల కేటాయింపుల సమయంలో ఎవరు పవర్ లో ఉన్న అపొజిషన్ లీడర్ గా ఉన్న స్నేహితుడ్ని నిక్ నేమ్ తో సంభోదించి మరీ కలిశారా అంటూ ఆరాతీసేవారు. అంటే అక్కడ ఏ సమస్య రాకుండా సామరస్యక, స్నేహపూర్వకంగా వారు నడుచుకునే వారన్నమాట.

పీఆర్పీని నిర్వీర్యం చేసింది వారే…
అంతెందుకు వైఎస్సార్, చంద్రబాబుల స్నేహమే చిరంజీవి ప్రజారాజ్యం నిర్వీర్యానికి కారణమంటూ ఇప్పటికీ పొలిటికల్ గా కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇద్దరూ కలిసి చిరంజీవి పీఆర్పీని రాజకీయంగా ఎదగనీయకుండా కుట్రలు చేశారని విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పటికీ వెలువడుతూనే ఉంటాయి. పీఆర్పీ రూపంలో ప్రాంతీయ పార్టీ ఉంటే తమకు అడ్డంకిగా ఉంటుందని భావించి వైఎస్సార్, చంద్రబాబు వ్యూహం పన్నారన్న ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనం అందులో భాగమేనన్న ప్రచారం ఉండేది. పనిగట్టుకొని పీఆర్పీని పలుచన చేయడంలో అటు వైఎస్సార్, ఇటు చంద్రబాబు సక్సెస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడిచింది. కానీ వైఎస్ కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జగన్ మాత్రం తనను జైలుకు పంపించడంలో చంద్రబాబు పాత్ర ఉందన్న అనుమానమే ద్వేషంగా మారింది. అదే ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం పెంచింది.