Jagan: ఏపీ విషయంలో బిజెపి ఎలా వ్యవహరిస్తుందో తెలియడం లేదు. బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టిడిపి భావిస్తోంది. ఇప్పటికే టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపిని సైతం కలుపుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్య వ్యవహారం ఇలా ఉంటే వైసీపీ మాత్రం స్తబ్దుగా ఉంది. బిజెపికి ఎటువంటి ఆఫర్ చేయడం లేదు. ఒంటరి పోరైనా చేయాలి.. లేకుంటే ఆ కూటమితో కలిసి వెళ్లాలి. ఇలా చేస్తూనే తమతో స్నేహంగా ఉండాలని మాత్రం జగన్ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది.
గత నాలుగు సంవత్సరాలుగా బిజెపితో వైసీపీ స్నేహం కొనసాగిస్తోంది. కానీ కలిసి నడవడానికి మాత్రం ఇష్టపడడం లేదు. గత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపిని బిజెపి విభేదించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుంటూ వచ్చాయి. అలాగని పార్టీలపరంగా కలిసే ఉద్దేశం లేదు. ఒకవేళ బిజెపితో కలిస్తే వైసిపికి ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకు దూరం అవుతుంది. ఎస్సీ ఎస్టీలు సైతం దూరం జరుగుతారు. అందుకే బిజెపితో స్నేహం వరకే పరిమితం కావాలని వైసిపి చూస్తోంది. రాజకీయ అవసరాలు తీర్చుకుందామని సైతం ప్రతిపాదనలు పెట్టింది. ఇప్పటివరకు జరిగింది కూడా ఇదే. అయితే ఇప్పుడు ఎన్నికల్లో బిజెపి ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి.
బిజెపి ఒంటరిగా పోటీ చేయాలని వైసిపి ఆశిస్తోంది. కేంద్ర ప్రభుత్వపరంగా టిడిపి, జనసేన కూటమికి ఎన్నికల క్యాంపెయినింగ్ సహకారం దక్కకూడదు అన్నది జగన్ అభిమతం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో విభేదించిన బిజెపి ఏ స్థాయిలో తనకు సహకారం అందించిందో జగన్ కు తెలుసు. ఒకవేళ బిజెపి ఆ కూటమిలో చేరితే ఆ ఇబ్బందులు ఈసారి తనకు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ బిజెపి ఒంటరి పోరు చేయాలని కోరుకుంటున్నారు. అవసరమైతే ఎన్నికల తర్వాత ఇదే తరహా రాజకీయ సాయం అందిస్తానని చెబుతున్నారు. బిజెపి సైతం వైసీపీ విషయంలో సానుకూలంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఒకవేళ బిజెపి ఆ రెండు పార్టీల కూటమిలోకి చేరితే రాజకీయంగా ప్రయోజనం పొందాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు, ఎస్సీ ఎస్టీల బలాన్ని జగన్ పొందగలిగారు. సుమారు 80 శాతం మంది ఆ వర్గాల ప్రజలు తనవైపు మొగ్గు చూపారు. ఒక 20 శాతం మంది మాత్రం టీడీపీ వైపు ఉండిపోయారు. ఎన్నికల్లో మాత్రం ఈ వర్గాలన్నీ దాదాపు చెరి సమానం కానున్నాయని అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిజెపి ఆ కూటమిలోకి చేరితే ఆయా వర్గాలన్నీ వైసీపీ వైపు పూర్తిస్థాయిలో టర్న్ అయ్యే అవకాశం ఉంది. గుంప గుత్తిగా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు తన వైపు మళ్లుతాయని జగన్ ఆశలు పెట్టుకున్నారు. బిజెపి ఒంటరి పోరాటం చేస్తే అలా.. కూటమితో కలిసి వెళ్తే ఇలా.. ఎలా తీసుకున్న తనకు వర్కౌట్ అయ్యేలా జగన్ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. అయితే అవి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి.