
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మూడడుగుల ముందుకు.. ఆరు అడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. సుదీర్ఘ కాలం విచారణ కొనసాగుతోంది. కానీ కొలిక్కి రావడం లేదు. అసలు వివేకా హత్య రాజకీయ కోణంలో జరిగిందా? లేకుంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అన్నది మాత్రం తెలియడం లేదు. సుప్రీం కోర్టు కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చింది. సీబీఐ చర్యలను తప్పుపట్టింది. లోతైన కారణాలపై దర్యాప్తు చేయకుండా.. కేవలం రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేయడం ఏమిటని ప్రశ్నించింది. విచారణ అధికారినే మార్చాలని ఆదేశించింది. దీంతో లోతైన కారణాలు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీబీఐ ఫస్ట్ చార్జిఫీట్ లో చూపిన ‘డాక్యుమెంట్’ అన్న పదం చుట్టే ఇప్పుడు చర్చ మొదలైంది. డాక్యుమెంట్స్ కోసమే వివేకాను హత్య చేశారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జరిగింది ఇదా?
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇందులో దస్తగిరి బెయిల్ పై బయట ఉన్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి హత్య చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఇది రాజకీయ కోణంలో కాగా.. డాక్యుమెంట్స్ కోణం మరోలా ఉంది.‘సునీల్ యాదవ్ సమీప బంధువు ఒకరి స్థలం కబ్జాకు గురైంది. దానిని షటిల్ చేసేందుకు సునీల్ యాదవ్ ద్వారా వివేకాను ఆశ్రయించారు. అప్పటి నుంచి వివేకా పేరు చెప్పుకొని సునీల్ యాదవ్ కలెక్షన్ల పర్వానికి దిగారు. విషయం తెలుసుకొని వివేకా మందలించారన్న ఒక టాక్ ఉంది. అక్కడి నుంచి సునీల్ యాదవ్ వివేకాపై కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వివేకాతో సన్నిహితంగా ఉండే ఎర్ర గంగిరెడ్డి సాయంతో సునీల్ యాదవ్, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు కలిసి వివేకా ఇంట్లో ప్రవేశించారు. వివేకాను విచక్షణారహితంగా కొట్టారు. ఈ క్రమంలోనే ‘డాక్యుమెంట్స్’ ఎక్కడ అని ప్రశ్నించారు. పలానా చోట డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పిన తరువాతే వివేకాను హతమార్చారు’…తొలి చార్జిషీట్ లో సీబీఐ చేసిన ప్రస్తావన ఇది. అయితే డాక్యుమెంట్స్ ఏమిటన్నది మాత్రం బయటకు వెల్లడి కాలేదు. ఇప్పుడు సీబీఐ విచారణ అధికారి మారే క్రమంలో డాక్యుమెంట్ ఇష్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది.

తాజా దర్యాప్తుతోనైనా కొలిక్కి వచ్చేనా?
నాలుగేళ్లుగా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నా కేసు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పటివరకూ సిట్ లు మారుతున్నా.. వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేసినా ఏ ఒక్కటీ కొలిక్కి రాకపోవడం వెనుక రాజకీయ కోణాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా సీబీఐ కొత్త ‘సిట్’ను నియమించింది. ఇప్పటిదాకా దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్పీ రాంసింగ్‌ను సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ కేసు నుంచి తప్పించింది. కొత్తగా డీఐజీ కేశవ్‌రామ్ చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇందులో… ఎస్పీ వికాస్ కుమార్, అదనపు ఎస్పీ ముఖేశ్ శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పుణియ, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్‌ను సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం ఆమోదించింది. మరోవైపు కేసులో నిందితుడిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైకోర్టులో వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇప్పటివరకూ సీబీఐ నమోదుచేసిన చార్జిషీట్ లను క్రోడీకరించి దర్యాప్తు చేపట్టే చాన్స్ ఉంది.