KCR Land Cruisers Cars: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా ఏడాది క్రితం టయోటా కంపెనీకి చెందిన 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేశారు. వాటికి బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించేందుకు విజయవాడకు పంపించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు పూర్తి అవుతాయో కూడా తెలియదు. పైగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అవి తెలంగాణకు ఎప్పుడు వస్తాయో కూడా అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ కార్ల గురించి తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ కార్లకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించే బాధ్యత తీసుకున్న కంపెనీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందని తెలుస్తోంది..
ఏడాదికాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ కార్ల పనులు కొనసాగేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ.. ఆ బాధ్యతలు స్వీకరించిన కంపెనీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఆ పనులు సాగుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి టయోటా కంపెనీకి చెందిన ల్యాండ్ క్రూయిజర్ కార్లకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించేందుకు దాదాపు పది మంది నిపుణులు పని చేస్తూ ఉంటారు. అయితే ఈ బాధ్యత తీసుకున్న త్రి హాయని కంపెనీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. మొదట్లో పది మంది నిపుణులు ఈ పని చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఐదుగురికి పడిపోయింది. పైగా వారంతా కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారు. ఇక గతంలో త్రి హాయని.. మిత్ర కంపెనీ, జపాన్ దేశానికి చెందిన క్యూ కుటో కంపెనీతో కలిసి పనిచేసేది. అయితే ఆ ఒప్పందం నుంచి క్యూ కుటో తప్పుకుంది. దీంతో ఆ భారం మొత్తం మిత్ర కంపెనీ పైన పడింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు మిత్ర కంపెనీ బకాయి పడటంతో ప్లాంట్ సీజ్ చేశారు. బ్యాంకు సెక్యూరిటీ కింద కూడా ఈ ప్లాంట్ కు ప్రస్తుతం పహారా కొనసాగుతోంది. అధిక ఇబ్బందులతో పాటు అనుమతుల లేని కూడా ఈ కార్ల బుల్లెట్ ప్రూఫ్ నెమ్మదించడానికి కారణమని సమాచారం.
గతంలో ఈ కంపెనీ మిలటరీ బస్సులకు బుల్లెట్ ప్రూఫ్ పనులు చేసేది. కెసిఆర్ ప్రభుత్వం కొలువు తీరిన తొలినాళ్లలో దాదాపు 18 ఫార్చునర్ కార్లకు కూడా ఈ సంస్థ బుల్లెట్ ప్రూఫ్ చేసింది. మిత్ర సంస్థకు అనుమతి లేకుండానే అప్పట్లో బుల్లెట్ ప్రూఫ్ పనులు చేసినట్టు సమాచారం. అయితే గత ఏడాది కేసీఆర్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లు పంపిన తర్వాతే బుల్లెట్ ప్రూఫ్ అనుమతులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన కాన్వాయ్ లోని పది వాహనాలకు త్రి హాయని సంస్థనే బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించింది. అయితే అప్పటికి కూడా ఈ సంస్థకు ఆ అనుమతులు లేకపోవడం విశేషం. అయితే జగన్ సూచనలతోనే కెసిఆర్ తన 18 వాహనాలకు ఇక్కడ బుల్లెట్ ప్రూపింగ్ సౌకర్యం కల్పించేందుకు ఈ కంపెనీని ఆశ్రయించారు. అయితే జగన్, కెసిఆర్ కాన్యాయ్ లోని వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించిన ఈ సంస్థ.. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోని వాహనాలకు మాత్రం ఆ సౌకర్యం కల్పించేందుకు మాత్రం ఒప్పుకోలేదు.