Pathankot: పఠాన్‌ కోట్‌లో ఉగ్రవాదులు.. హై అలర్ట్‌ ప్రకటించిన సైన్యం!

పఠాన్ కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీం మిర్‌ మాట్లాడుతూ ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా సరిహద్దులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అనుమానితులే కథువాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు గుర్తించామన్నారు.

Written By: Raj Shekar, Updated On : June 26, 2024 4:55 pm

Pathankot

Follow us on

Pathankot: భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పఠాన్‌కోట్‌ జిల్లాలో మళ్లీ ఉగ్రవాదులు చొరబడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో సంచరిస్తున్నట్లు భద్రతాదళాలు గుర్తించాయి. దీంతో సైన్యం అప్రమత్తమైంది. బుధవారం హై అలర్ట్‌ ప్రకటించింది. పలు గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

అనుమానాస్పద కదలికలు..
పఠాన్‌ కోట్‌లో ఉగ్ర కదలికలపై బోర్డర్‌ రేంజ్‌ డీఐజీ రాకేశ్‌ కుశాల్‌ స్పందించారు. మంగళవారం(జూన్‌ 25న) రాత్రి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టామని తెలిపారు. ఇప్పటికే బీఎస్‌ఎఫ్‌ సహా అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు.

కోట్‌ భట్టియాన్‌లో సాయుధులు..
పఠాన్ కోట్‌ ఎస్‌ఎస్‌పీ సుహైల్‌ ఖాసీం మిర్‌ మాట్లాడుతూ ఇద్దరు సాయుధులు కోట్‌ భట్టియాన్‌ గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా సరిహద్దులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అనుమానితులే కథువాలోని కోట్‌ పన్నూలో కూడా సంచరించినట్లు గుర్తించామన్నారు.

12న సరిహద్దులు దాటి..
ఇద్దరు సాయుధులు భారీగా ఆయుధాలతో జూన్‌ 12న పాకిస్తాన్‌ నుంచి కథువా జిల్లా సుక్‌పాల్‌ గ్రామంలోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు అనుమానితులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. తాజాగా పఠాన్‌ కోట్‌ ప్రాంతంలో మరో ఇద్దరు ఆయుధాలతో సంచరించడంతో పాక్‌ నుంచి మళ్లీ చొరబాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. భారత్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడం ద్వారా అస్థిరత సృష్టించడానికి పాకిస్తాన్‌ ఉగ్రవాదుల చొరబాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.

2016లో వాయుసేన స్థావరంపై దాడి..
2016 జనవరిలో పఠాన్‌కోట్‌లోని వాయుసేన స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అప్పట్లో కూడా వారు తొలుత వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్‌ చేశారు. ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడే భారీగా పెరిగిన గడ్డిలో నక్కారు. తెల్లవారుజామున సిబ్బంది క్వార్టర్స్‌లోకి ప్రవేశించి దాడిచేసి పలువురి ప్రాణాలను బలిగొన్నారు. వీరిని మట్టుపెట్టడానికి వాయుసేనతోపాటు భద్రతా దళాలు కొన్ని రోజులు శ్రమించాయి. అయితే నాటి దాడిలో వాయుసేన ఆయుధాలకు ఎలాంటి నష్టం జరుగలేదు.