china india war
ఇండియా, చైనా మధ్య సరిహద్దులో టెన్షన్ వాతావరణం నడుస్తోంది. లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో రెండు దేశాలూ బలగాలను మోహరించాయి. తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చూపేందుకు భారత సైన్యం సర్వం సన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను ఇంచు కూడా కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ప్రారంభం కాగానే భారత సేన వెనుతిరుగుతుందనుకున్న డ్రాగన్ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్ దాదాపు పూర్తికావొస్తోంది. భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. దళాల ఉపసంహరణకు చైనా మొండికేస్తుండడంతో భారత్ సమర సన్నాహాలను ముమ్మరం చేసింది. డ్రాగన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సాయుధ కవచ శకటాలను రంగంలోకి దింపింది. వీటిలో టీ-72, టీ-90 యుద్ధ ట్యాంకులు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ఉన్నాయి. వీటితో పాటు ఫిరంగి, శతఘ్ని దళాలూ భారీగానే సిద్ధం చేశారు. ఈ ఆపరేషన్‌ను సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె పర్యవేక్షిస్తున్నారు.
16,000 అడుగుల ఎత్తున మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద కూడా చురుగ్గా కదిలి శత్రు సేనపై ఈ యుద్ధ ట్యాంకులు అగ్నివర్షం కురిపించగలవు. ఛుమార్ డెంఛాక్ ఏరియాలో వాస్తవాధీన రేఖకు అతి సమీపాన భారీ ఎత్తున బలగాలను, ఈ ట్యాంకులను మోహరించింది. ఉన్న దళాలకు తోడుగా మరో మూడు ఆర్మీ డివిజన్లను దింపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను నిర్మించింది. తూర్పు లద్దాఖ్ ప్రాంతం కఠోరమైన శీతాకాలానికి పెట్టింది పేరు. అక్టోబరు నుంచి జనవరి నెలాఖరుదాకా రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్ 5 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా పడిపోతాయి. వీటికి తోడు తీవ్రమైన మంచుగాలులు పగలూ రాత్రీ వీస్తుంటాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చైనాను నియంత్రించి, సరిహద్దులు కాపాడే విధులు నిర్వర్తించేలా విధంగా సైన్యం సమాయత్తమవుతోంది.
కేవలం సాయుధ బలగాలు, శకటాలే కాదు.. ఈ నాలుగు నెలలూ అక్కడే ఉండడానికి టెంట్లు, కమ్యూనికేషన్ ఉపకరణాలు, శీతాకాలంలో ధరించే దుస్తులు, కంబళ్లు, బూట్లు, హీటర్లు అన్నింటినీ హుటాహుటిన తూర్పు లద్దాఖ్‌కు పంపింది. ఓ రకంగా తూర్పు లద్దాఖ్ వార్ జోన్‌ను తలపిస్తోంది. లేహ్‌లో కూడా సాయుధ బలగాలు, శకటాలు, ఆయుధాలు, ఫిరంగి దళాలను సిద్ధం చేశారు. ‘స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు ఎన్నడూ జరగలేదు. ఇదే పెద్దది.. బహుముఖీనమైనది’ అని సీనియర్ సైనికాధికారి ఒకరు చెప్పారు.