Telangana Congress: కాంగ్రెస్ లో ఆ టికెట్.. సర్ ప్రైజ్

అయితే విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భువనగిరి టికెట్‌ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Written By: Neelambaram, Updated On : December 26, 2023 3:36 pm
Follow us on

Telangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఇప్పుడు లోక్‌సభపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోరుమీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలవాలని భావిస్తోంది. ఇక మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 10 స్థానాలపై గురిపెట్టింది. 2019లో 5 స్థానాల్లో గెలిచినందున, ఈసారి వాటితోపాటు కొత్తగా మరో 5 గెలవాలని భావిస్తుంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ కూడా డబుల్‌ డిజిట్‌పై దృష్టిపెట్టింది. అయితే విజయోత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భువనగిరి టికెట్‌ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

బరిలో తీన్మార్‌ మల్లన్న..
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో హస్తం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన దాదాపు అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ పెద్దలు తీన్మార్‌ మల్లన్నపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా తీన్మార్‌ మల్లన్న లేదా కోదండరామ్‌ లేదా అకునూరి మురళికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తీన్మార్‌ మల్లన్నకు భువనగిరి నుంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం సంకేతాలతో తీన్మార్‌ మల్లన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే మద్దుతు కూడగడుతున్నట్లు తెలుస్తోంది.

‘కోమటిరెడ్డి’ బ్రదర్స్‌ మద్దతు
నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచి పట్టు ఉంది. వారు తీన్మార్‌ మల్లన్న అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు. టికెట్‌ ఇస్తే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీన్మార్‌ మల్లన్న మొదట్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ.. ఎన్నికల సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌తో కలిసిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు కూడా తీన్మార్‌ మల్లన్నకు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్‌ పాదయాత్ర సందర్భంగా తీన్మార్‌ మల్లన్న రేవంత్‌రెడ్డిని హైలెట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ టికెట్‌ మల్లన్నకు ఖరారు చేశారని తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి బూర నర్సయ్యగౌడ్, అలాగే బీఆర్‌ఎస్‌ బూడిద భిక్షమయ్య గౌడ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.