TDP Janasena Alliance: జగన్ సర్కార్ పై తెలుగుదేశం, జనసేనలు యుద్ధం ప్రకటించాయి. తొలి ఉమ్మడి కార్యాచరణగా ఏపీలో కరువు పై పోరాడాలని నిర్ణయించాయి. రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లక్షల ఎకరాల్లో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ వైసీపీ సర్కార్ కరువు నష్టం అంచనా వేయడంలో విఫలమైంది. దాదాపు 500 మండలాల్లో కరువు ఛాయలు నెలకొంటే.. కేవలం 140 మండలాల్లో మాత్రమే కరువు నెలకొందని చెబుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తరుణంలో టిడిపి, జనసేనలో ప్రభుత్వ కరువు అసమర్ధతపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 32 శాతం లోటు వర్షపాతం నమోదయింది. గత రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో వరి పొలాలు నెర్రలు చాచాయి. చాలా జిల్లాల్లో పంట పొలాలను రైతులు దున్నేశారు. ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గోడ దెబ్బ.. చెంప దెబ్బ అన్నట్టు.. ఒకవైపు పంటల నాశనం కాగా.. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. రైతు భరోసా రూపంలో సాయం అందిస్తున్నాం కనుక.. పరిహారం అక్కర్లేదన్న రీతిలో సీఎం జగన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మధ్యన క్యాబినెట్ సమావేశం నిర్వహించినా కరువు పై చర్చించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం నోరు తెరవకపోవడం విశేషం.
పైగా కరువు కొంచెమే ఉందంటూ సీఎం జగన్ సర్దుబాటు మాటలు పుండు మీద కారం చల్లినట్లు అవుతున్నాయి. సాగునీటి విడుదల, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కరువు మండలాలను గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. రైతు భరోసా కింద సాగు సాయం చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. అంతకుమించి ఏమీ చేయలేమన్న నిట్టూర్పు మాటలు రైతులకు ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. నిత్యం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ సర్కార్.. అదే రైతులు కష్టంలో ఉండగా పట్టించుకోకపోవడంపై టిడిపి, జనసేనలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై ప్రజల మధ్యకు వెళ్లి పోరాటం చేయాలని డిసైడ్ అయ్యాయి.
పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ రెండు పార్టీలు ఉద్యమ కార్యాచరణను ప్రారంభించాయి. కరువు అసమర్థతపై గట్టిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విజయవాడలో రెండు పార్టీల జేఏసీ ప్రతినిధుల సమావేశంలో కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు. ఇక్కడ నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని.. వచ్చే జేఏసీ సమావేశం జనసేన కార్యాలయంలో నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈనెల 14,15,16 తేదీల్లో నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సైతం నిర్ణయించారు. అక్కడ కూడా నియోజకవర్గస్థాయిలో కరువు పై పోరాటం చేయడానికి సన్నాహాలు చేయాలని రెండు పార్టీల నాయకత్వాలు సూచించాయి. కనీసం విపక్షాలు దూకుడు పెంచితే… సీఎం జగన్ వైఖరిలో మార్పు వస్తుందని రైతు సంఘాల ప్రతినిధులు ఆశిస్తున్నారు. మరి ఎలా స్పందిస్తారో చూడాలి.