KCR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. తుంటి ఎముక విరగటం.. ఆ తర్వాత ఆసుపత్రి పాలు కావడం.. చాలాకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత కేసీఆర్ ఆ మధ్య బయటికి వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఆ సమావేశాలకు హాజరు కాలేదు. అయితే కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండ వేదికగా మంగళవారం నిర్వహించిన సభకు మాత్రం హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు ఉండటం.. పార్టీ స్థితి రోజురోజుకు దిగజారి పోతుండడంతో.. క్యాడర్లో ఉత్తేజం పెంచేందుకు.. నల్లగొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాల నుంచి భారత రాష్ట్ర సమితి నాయకులు భారీగా జన సమీకరణ చేశారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఒక్కొక్కరుగా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. కెసిఆర్ ఈ సభా వేదికగా శ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. సహజంగా తనకు అలవాటైన సెంటిమెంట్ ను ప్రజల్లో రాజేశే ప్రయత్నం చేశారు.
కట్టె కాలే వరకు తెలంగాణ కోసమే..
సభలో కెసిఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. కట్టె కాలే వరకు తెలంగాణ కోసమే కొట్లాడుతానని ప్రకటించారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ అని కెసిఆర్ అన్నారు. “నాకు కాలు విరిగింది. కుంటుకుంటూ కుంటుకుంటూ వచ్చాను.. ఇంత ఆయాసంతో ఇక్కడిదాకా రావాల్సిన అవసరం నాకు ఏముంది? కొందరికి ఇది రాజకీయం.. మనం పెట్టింది ఉద్యమ సభ. కృష్ణా జలాల మీద మనకు హక్కు ఉంది. ఇది మనందరి జీవన్మరణ సమస్య. ఈ మాట 24 సంవత్సరాల నుంచి పక్షిలాగా తిరుగుకుంటూ రాష్ట్రం మొత్తానికి చెబుతున్న. అటు కృష్ణా నీళ్లు కావచ్చు, ఇటు గోదావరి నీళ్లు కావచ్చు.. నీళ్లు అనేవి లేకుంటే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు సరిగా లేకపోతే మన బతుకులు ఆగమైపోతాయి” అంటూ ప్రజల్లో కేసీఆర్ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
మేడిగడ్డ విషయాన్ని ప్రస్తావించలేదు
ఈ సభలో మేడిగడ్డ విషయాన్ని ప్రస్తావించని కేసీఆర్.. కేవలం ఫ్లోరైడ్ సమస్యను మాత్రమే ప్రస్తావించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిందని కెసిఆర్ అన్నారు. ఇదే విషయాన్ని ఇక్కడి ప్రజలు పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. భగీరథ నీళ్ల ద్వారా ప్రజల దాహార్తి తీర్చామని కేసీఆర్ అన్నారు. తాము చేసిన ఉద్యమం వల్లే కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని తీర్మానం చేశారని గుర్తు చేశారు. “కెసిఆర్ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే కెసిఆర్. అలాంటి నన్ను రాష్ట్రంలో తిరగబోనివమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? నన్నెవడు తెలంగాణలో తిరగనియ్యనిది.. అంత దమ్ముందా? కెసిఆర్ నే అడ్డుకుంటారా” అని కెసిఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. ఇది రాజకీయ సభ కాదంటూనే పదేపదే రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలను కేసీఆర్ చేశారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కెసిఆర్ నల్లగొండలో సభ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.