Bheemla Nayak Pre Release Event: ఎక్కడైనా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లు జరిగితే.. ఆ సినిమా గురించి గొప్పగా చెబుతారు. మా సినిమా ఆహా.. ఓహో అని అందులోని హైలెట్స్ ను నొక్కివక్కాణిస్తారు. అందులోని టెక్నీషియన్స్, నటీనటుల కష్టాన్ని, టాలెంట్ ను విడమరుస్తారు. కానీ నిన్న జరిగిన ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక చూస్తే ఆ సినిమా గురించి తక్కువగా.. రాజకీయ ప్రసంగాలు ఎక్కువగా చేశారని చూసిన వారు ఎవరైనా సరే చెబుతున్నారు. మంత్రులు కేటీఆర్, తలసానిలు కేసీఆర్ గొప్పతనం గురించి, ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన పనుల గురించి.. ఆఖరుకు కేసీఆర్ నిన్న జాతికి అంకితం చేసిన ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్టు గురించి ప్రచారం చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ‘భీమ్లానాయక్’ వేడుకలో తన సర్కార్ గొప్పతనం గురించి మాట్లాడడం చూసి సినీ ప్రేక్షకులంతా ముక్కున వేలేసుకున్నారు.
దీంతో ఈ సినీ వేడుక కాస్తా టీఆర్ఎస్ సర్కార్ డబ్బా కొట్టుకునే ప్రమోషన్ వేడుకలా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆఖరుకు పవన్ సైతం సగం రాజకీయాల గురించే మాట్లాడడంతో ఇదో పొలిటికల్ ఫంక్షన్ లా సాగిపోయింది.
భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ వేడుకలో మొదట తలసాని అందుకున్నారు. కేసీఆర్ గొప్పతనాన్ని.. సినిమా ఇండస్ట్రీ కోసం చేస్తున్న సేవలను వివరించి.. అందరూ సహకరించాలని కోరారు. ఇక కేటీఆర్ అయితే భీమ్లానాయక్ కు సంబంధం లేని ‘మల్లన్నసాగర్’ ప్రాజెక్ట్ గొప్పతనం గురించి చెప్పి.. గోదావరి జిల్లాల్లోనే కాదు.. ఇక తెలంగాణలోనూ మీరు షూటింగ్ లు చేసుకోవచ్చని పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు.
ఇక పవన్ సైతం రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదని.. ఏపీ రాజకీయాల గురించే మాట్లాడారు. ఇలా సినిమా గురించి తక్కువ.. రాజకీయ ప్రసంగాల గురించి ఎక్కువగా ఈ వేడుకలో వినిపించింది.
నిజానికి ఒక్కొక్కరిని పిలిచి వేదికపై మాట్లాడితే వారి అభిప్రాయాలను విపులంగా వివరిస్తే సినిమాకు ఇంకాస్త హైప్ వచ్చేది. కానీ ఈ వేడుకలో సంగీత దర్శకుడు తమన్ పాటల పర్ ఫామెన్స్ యే 10 గంటల వరకూ సాగింది. దీంతో టైం లేక కేటీఆర్, పవన్, మంత్రులు మూడు ముక్కలు మాట్లాడి ఊరుకున్నారు. ఫంక్షన్ ఇలా హడావుడిగా ముగియడానికి ప్రధాన కారణం తమన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాత్రి వరకూ పాటలకే కేటాయించి మాట్లాడడానికి సమయం లేకుండా చేసేశాడు. దీంతో ప్రసంగాలే లేకుండా చప్పగా ఈ వేడుక ముగిసింది. అందులోనూ రాజకీయ ప్రసంగాలే ఎక్కువగా వినిపించాయి.
Also Read: Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక