తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోకి రావడం లేదన్నది మాత్రం నిజం. అయితే తప్పుడు అంకెలతో మొత్తం పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించడం కోసం ప్రభుత్వం విఫల ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక బహిరంగ లేఖలో ప్రభుత్వ ఎత్తుగడను ఎండగట్టింది.
పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ తో పోల్చుకొంటే తెలంగాణలో ఏదో దాస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పేర్కొన్నది. రాష్ట్రలో కోవిద్ టెస్ట్ లను గణనీయంగా పెంచడం ద్వారా మాత్రమే వైరస్ ఏ మేరకు వ్యాపించిందో వెల్లడి కావడానికి దారితీయగలదని స్పష్టం చేసింది.
చాలా కాలం వరకు తెలంగాణ కన్నా బాగా వెనుకబడి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కేసుల విషయంలో చాలా ముందుకు వెళ్ళడానికి అక్కడ పరీక్షలు ఎక్కువ జరగడమే కారణం కావడం గమనార్హం. ఏపీలో ఇప్పుడు ఈ సంఖ్యా 1177కు వెళ్లగా, తెలంగాణలో మాత్రం ఇప్పుడు 1000 దాటడం గమనార్హం.
తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ జరిగిన పరీక్షలతో పోల్చుకొంటే వైరస్ సోకినా వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఏపీలో 1.66 శాతం మాత్రమే ఉంటె, తెలంగాణలో మాత్రం 5.35 శాతంగా ఉన్నది. అంటే తెలంగాణలో వైరస్ ఏపీలో కన్నా 3.2 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
అందుకు కారణం జరుపుతున్న టెస్టులు మాత్రమే. ఏపీలో 62 వేలకు పైగా టెస్ట్ లు జరిపితే, తెలంగాణలో 20 వేలకు లోపుగానే జరిపారు. అంటే మూడోవంతకన్నా తక్కువగా టెస్ట్ లు ఇక్కడ జరుగుతున్నాయి. అందుకనే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు చూపగలుతున్నారు.
తెలంగాణలో కేసులు తక్కువగా ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలను జెఎసి తెలిపింది. అవి తక్కువగా టెస్ట్ లు ఉండడం, ఆసుపత్రులలో మృతి చెందుతున్న వారిని కరోనా మృతులుగా గమనించక పోవడం. పాజిటివ్ కేసుల సెకండరీ కాంటాక్ట్ లకు టెస్ట్ లు జరుపవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం.
వైరస్ ఉధృతిని కప్పిపుచ్చడం ద్వారా దీనిని కట్టడి చేయలేమని, కేవలం విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారానే సాధ్యం కాగడాలని టిజెఎసి స్పష్టం చేసింది. కేసులు తక్కువ అవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ధ్వజమెత్తింది. వేలసంఖ్యలో టెస్ట్ లు జరపడం ద్వారానే ఈ వైరస్ మహమ్మారిని అంతమొందించ గలమని వెల్లడించింది. .
అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాగలదు.