Teleangana Politics: తెలంగాణలో నవంబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దేశంలో పలు చోట్ల ఇదే రోజున ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి రెండు చోట్ల మినహా ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలే మళ్లీ గెలిచాయి. పొరుగున ఉన్న ఏపీలోనూ వైసీపీ భారీ విజయం సాధించింది. అయితే తెలంగాణలోని హుజూరాబాద్ లో మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బీజేపీ గెలిచింది. దీంతో ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ అని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు.
వాస్తవానికి అధికార టీఆర్ఎస్ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఈ ఎప ఎన్నికలో గెలవడమే కాకుండా భారీ మెజారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ 23 వేల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో హుజూరాబాద్ ప్రజలు పార్టీని కాకుండా తమకు సాయం చేసే వ్యక్తి ఈటల అని నమ్మి గెలిపించారని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడేళ్లపాటు తిరుగులేని శక్తిగా కేసీఆర్ ఎదిగారు. ఓ వైపు ప్రజల కోసం రైతుబంధు లాంటి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందారు. మరోవైపు ప్రతిపక్ష ఉనికి లేకుండా ఆ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీల్లోకి చేర్చుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి గెలిచిన నాయకులంతా టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఇక తమకు ప్రతిపక్ష బెడదలేదని అనుకున్నారు. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ తయారవుతుందని కేసీఆర్ ఊహించలేదు. అంతేకాకుండా కమలం పార్టీకి దొరికిన అవకాశాన్ని వినియోగించుకొని ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీకి చుక్కెదురైంది. ఇక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకోకుండా మరణించడంతో ఏర్పడిన ఉప ఎన్నికలో బీజేపీ జెండా ఎగురవేసింది. అయితే ఈ సమయంలో ‘ ఈ ఉప ఎన్నికతో ప్రభుత్వం పడిపోదు’ అని టీఆర్ఎస్ నాయకులు వాదిస్తూ వచ్చారు. ఇక తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ తరుపున ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఈ ఉప ఎన్నికతో ఏమీ ఒరగదు’ అని ప్రకటన చేశారు. అయితే కేటీఆర్ పైకి అలా చెబుతున్నా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాత్రం అధికార పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించారు.
అయితే ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను ఆదరించకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పడిన శ్రమను మాత్రం ప్రజలు అర్థం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనిది కేవలం ఈటల రాజేందర్ ను ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అంతకుముందు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని కొందరు అంటున్నారు. అంతేకాకుండా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టి హుజూరాబాద్ ను ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇవ్వకుండా తమ వ్యాపారం కోసం సాయం చేస్తానని చెప్పినా అందులో పారదర్శకత కనిపించలేదు. అంతేకాకుండా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు పడినా వాటిని లబ్ధిదారులు ఏం చేయలేని పరిస్థితి.
ఇవే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాలకు చెందిన నాయకులు హుజూరబాద్ లో మకాం వేసి ప్రచారం చేశారు. ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమేనని, ప్రభుత్వం ఈ ఉప ఎన్నికతో ఎలాంటి నష్టం చేయకపోయినా ఇంతలా శ్రమించడానికి కారణమేంటన్న ప్రశ్న ఎదురైంది. దీంతో కేసీఆర్ కేవలం గెలుపే లక్ష్యంగా డబ్బులను ఖర్చు పెడుతున్నారని చర్చించుకున్నారు. దీంతో డబ్బుకంటే వ్యక్తికే ఆదరణ ఇచ్చి ఈటల రాజేందర్ ను గెలిపించారు. అయితే ఈ ప్రభావం వచ్చే ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.