Jagan And BJP: ఏపీలో ( Andhra Pradesh) కూటమి అధికారంలో ఉంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీకేలకు భాగస్వామి. అయితే ఏపీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి గా టిడిపిని చూస్తోంది. బిజెపి విషయంలో సానుకూలతగా చూస్తూ వస్తోంది. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఎంపీలకు కీలక టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో సానుకూలత వద్దని.. ఆ పార్టీని గట్టిగానే ఎదుర్కోవాలని ప్రధాని సూచించినట్లు ప్రచారం నడిచింది. ముఖ్యంగా చంద్రబాబు పాలనకు అండగా నిలవాలని సూచించినట్లు అనుకూల మీడియా రాస్కొచ్చింది. అయితే బిజెపికి చెందిన రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటనలు చూస్తుంటే మాత్రం తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డిని బిజెపి టార్గెట్ చేసినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు జరుగుతున్నాయి.
* మరింత వివాదం..
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల( Government Medical Colleges) ప్రైవేటీకరణకు సంబంధించిన వివాదం నడుస్తోంది. వైసీపీ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. కానీ వాటి నిర్మాణంలో వైసిపి గవర్నమెంట్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేకపోయింది. ఈ క్రమంలో వాటి నిర్మాణ బాధ్యతలను తీసుకుంది కూటమి ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో పూర్తి చేయాలని జీవో జారీ చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం కూడా చేపట్టింది. కోటి సంతకాల సేకరణ కూడా పూర్తి చేసింది. నిన్ననే గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కలిసిన జగన్మోహన్ రెడ్డి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ అతిగా ప్రకటనలు చేశారు. ఎవరైనా ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యతలను తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలపై గట్టిగానే స్పందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. అధిష్టానం నుండి వచ్చిన సూచనలతోనే ఆయనలా ప్రకటన చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.
* ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నా..
ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్( public private partnership) విధానం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేటు నిర్వహణలో.. ప్రభుత్వ పర్యవేక్షణలో మెడికల్ కాలేజీల అంశం ఉంటుందన్నది ప్రభుత్వ వాదన. ఆరోగ్య శ్రీ తో పాటు 108, 104 నిర్వహణ ఇలానే చేస్తున్నామని చెబుతోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని పట్టించుకునే స్థితిలో లేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. తద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావించింది. అయితే జగన్ తీరుపై ఇప్పటికే బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతుంది. మొన్ననే పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేయడం, తాజాగా ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గట్టిగానే హెచ్చరికలు పంపడం చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి పట్ల బిజెపి స్టాండ్ మారినట్లు తెలుస్తోంది.
* గట్టి సవాల్..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బిజెపికి చెందిన సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలకు జగన్ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు పంపారు. దీనిపై సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ప్రవేశపెట్టింది సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు. ఆ విధానాన్ని అమలు చేసే మంత్రిని తానేనంటూ.. ముందుగా తమను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అంత ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. ఇంకోవైపు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. దానిని పార్లమెంట్లో తప్పు పట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏకకాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న కొత్త డిమాండ్లు, బిజెపి రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం మున్ముందు జగన్మోహన్ రెడ్డికి గట్టి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి సైతం బిజెపి విషయంలో తాడోపేడో అన్నట్టు కనిపిస్తున్నారు. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.