Bangaru Telangana: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్.. దేశంలోని అత్యన్నత ప్రభుత్వ కొలువులకు ఎంపికయ్యేది ఈ సర్వీసుల నుంచే. జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని నడిపించేది వీరే. కలెక్టర్లు, ఎస్పీలు వంటి వారు ఈ పరీక్షల ద్వారానే ఎంపికవుతూ ఉంటారు. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజలకు సేవలు చేయడం. కానీ… తెలంగాణలోని ఇద్దరు పబ్లిక్ సర్వెంట్లు ఆ ఉన్నత పదవులకు తలవంపులు తెచ్చేలా వ్యవహారించారు. ఐఏఎస్ అంటే అధికార గులాబీ పార్టీకి ‘అయ్యా ఎస్’ అంటూ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులభజన చేస్తున్నారు. గతంలో ఇద్దరు ఐఏఎస్‌లు ప్రజాప్రతినిధుల ముందు మోకరిల్లారు. ‘ఐఏఎస్ అంటే ప్రజాప్రతినిధుల ముందు మోకరిల్లి వాళ్లేం చెబితే అది చేయడానిక తలాడించడం కాదు’ అని…ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో చులకనవుతున్నారు.

అభినవ అంబేద్కర్ అభివర్ణన..
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆదివానం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా అభివర్ణించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అంతటితో ఆగకుండా పేద దళిత, గిరిజన వర్గాలకు కేసీఆర్ ఆశాదీపంగా మారారని కొనియాడారు. ‘రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఆయనను ఇప్పుడు చూస్తున్నాను. కేసీఆర్ అభినవ అంబేద్కర్’ అని ఆకాశానికి ఎత్తేశారు. భూమి లేని గిరిజనులకు ‘గిరిజన బంధు’ ఇస్తామని సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
గతంలోనూ స్వామి భక్తి..
శరత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్వామిభక్తి చాటుకోవడం ఇది కొత్తకాదు. గతంలో జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ ఇలాగే వ్యవహరించి విమర్శలపాలయ్యారు. 68వ గణతంత్ర దినోత్సవ వేళ జగిత్యాల కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ శరత్.. కొత్త జిల్లాగా ఏర్పడిన జగిత్యాలలో జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జగిత్యాల నూతన జిల్లా జైత్రయాత్రలో సగౌరవంగా వంద రోజుల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గరగా చేరవేస్తున్న ఈ శుభ సందర్భంగా.. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన, చరిత్రాత్మక ‘జగిత్యాల ఖిల్లా’లో తొలి గణతంత్ర వేడుకలను నిర్వహించే అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి.. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దీంతో సభికులు అవాక్కయ్యారు. వేడుకకు హాజరైన ప్రజలు కూడా నోరెళ్లబెట్టారు. అంతటితో ఆగకుండా.. జగిత్యాల జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా ఖిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న నిజామాబాద్ ఎంపీ.. కల్వకుంట్ల కవిత గారికి శుభాభివందనాలు అన్నారు. ఇదిలా ఉంటే.. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఏకంగా గ్యాలరీలో కూర్చున్న సీఎం కుమార్తె, ఎంపీ కవిత దగ్గరికి వెళ్లి ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని ముచ్చటించారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు కలెక్టర్ శరత్.. సబ్ కలెక్టర్ ముషర్రఫ్ అలీ వ్యవహారంపైనే చర్చ జరిగింది. ఐఏఎస్ అంటే అయ్యా.. ఎస్, అమ్మా.. ఎస్ గా మార్చేసిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ మధ్య సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి కూడా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి విమర్శలపాలయ్యారు. కానీ పాదపూజకు ఫలితం దక్కించుకున్నారు. చివరకు ఎమ్మెల్సీ అయ్యారు.
మంత్రి భజనలో ఎస్పీ…
సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని పొగుడుతూ.. జయహో జగదీశ్‌రెడ్డి అంటూ ఆయన నినాదాలు చేయడం విమర్శలకు దారి తీసింది. సూర్యాపేటలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సభకు హాజరైన ప్రతి ఒక్కరూ మంత్రి జగదీశ్‌రెడ్డికి బహుమతి ఇవ్వాలని సూచించారు. సభకు వచ్చిన వాళ్లంతా తానిచ్చే నినాదాలతో స్వరం కలపాలని కోరారు. మంత్రి జగదీ‹శ్‌రెడ్డిని ప్రశంసిస్తూ.. జయహో జగదీశ్‌రెడ్డి అంటూ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు. అక్కడితో ఆగకుండా.. జగదీశ్‌రెడ్డిని బాహుబలి అని పొగుడుతూ ఆకాశానికెత్తారు. ఎస్పీ వ్యవహారశైలితో.. సభకు వచ్చినవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ నినాదాలు చేస్తున్న సమయంలో.. మంత్రి జగదీశ్ రెడ్డి వేదికపైనే ఉన్నారు. జిల్లా స్థాయి పోలీసు ఉన్నతాధికారి ఈ విధంగా నినాదాలు చేయడం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పబ్లిక్ సర్వెంట్‌గా కాకుండా పదవుల వ్యామోహం?
పబ్లిక్ సర్వెంట్ అయి ఉండి పబ్లిక్‌కు సేవ చేయాలి.. ప్రజలు చెల్లించే పన్నులతో జీతం తీసుకుంటున్నందుకు అవసరమైతే ప్రజల కాళ్లు మొక్కాలి. ప్రజలను బాహుబలిగా అభివర్ణించాలి. కానీ కలెక్టర్, ఎస్పీ హోదాలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధుల సేవలతో తరించడం, భజన చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్నవారే ఇలా భజనపరులుగా మారుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లో చేరి పదవుల చేపట్టాలన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి రిటైర్మెంట్‌కు నెలల వ్యవధి ఉన్నా.. కేసీఆర్ కాళ్లు మొక్కినందుకు పిలిచి ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు శరత్, రాజేంద్రప్రసాద్ కూడా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. దీంతో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనతోనే ఇలా భజన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్లిక్ సర్వెంట్‌ల తీరుపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ తీరపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. జిల్లా ఎస్పీ స్థాయిలో ఉండి.. టీఆర్‌ఎస్ కార్యకర్తలా నినాదాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఖాకీ యూనిఫామ్‌కు చాలా గౌరవం ఉండేదని.. దాన్ని పతనం చేస్తున్నారని ట్వీట్ చేశారు. గతంలో ఓ కలెక్టర్‌ను ఎమ్మెల్సీ చేసినట్టే.. రాజేంద్రప్రసాద్‌ను కేసీఆర్ కూడా ఎమ్మెల్సీ చేస్తారని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నాయకులు అయితే రాజేంద్రప్రసాద్‌లాంటి అధికారులు ఖాకీ యూనిఫాం తీసేసి పింకు యూనిఫాం వేసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరుగని విధంగా ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పబ్లిక్ సర్వెంట్స్ ఇలా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాలకులే అధికారులను తోలు బొమ్మలుగా మారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.