Honey Trap: తెలంగాణ పోలీసులంటే.. హైటెక్ అని అందరూ చెప్పుకుంటుంటారు. సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇలా దేశానికే రోల్ మోడల్ అని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటుంటారు. ఆ హైటెక్ వ్యవహారాన్ని ఓ టెకీ తుత్తునీయలు చేశాడు. అంతే కాదు ఓ పోలీస్ అధికారిని హనీ ట్రాప్‌లోకి లాగాడు. అంతే కాదు తనకు ఉన్న టెక్ పరిజ్ఞానంతో చుక్కలు చూపించాడు. దీంతో లబోదిబోమనడం ఆ అధికారి వంతయింది. అంతే కాదు ఈ వ్యవహారాన్ని పోలీస్ శాఖ అత్యంతగోప్యంగా ఉంచింది. రహస్యంగా విచారణ జరుపుతోంది.
తనపై అకారణంగా చేయిచేసుకున్న పోలీసు ఉన్నతాధికారికి ఓ ఐటీ ఉద్యోగి ఝలక్ ఇచ్చా డు. హైటెక్ పోలీసులుగా చెప్పుకొనే తెలంగాణ పోలీసు శాఖ కంగుతినేలా చేశాడు. ఆ అధికారి మొబైల్ ఫోన్ నంబర్‌ను సేకరించి, దాన్ని హ్యాక్ చేశాడా ఐటీ ఉద్యోగి. ఆ ఫోన్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అందులో ఉన్న ఇతరులతో చేసిన వాట్సాప్ చాటింగ్ డేటా.. వీడియోలు.. సోషల్ మీడియాలో చాటింగ్ వివరాలు.. ఇలా వ్యక్తిగ వివరాలను కొల్లగొట్టాడు.
తిరిగి ఆ అధికారికే..
తిరిగి ఆ అధికారికే ఆ వీడియోలను, మెసేజ్‌ల స్ర్కీన్‌షాట్లను పంపాడు. దీంతో.. కంగుతినడం ఆ అధికారి వం తైంది. ఇటీవల ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహిస్తుంటే.. పోలీసులు తమపై చేయిచేసుకున్నారంటూ ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. ఆరోజు తమ పట్ల దురుసుగా వ్యవహరించిన ప్రతి ఒక్క పోలీసు అధికారి, సిబ్బంది ఫోన్లలోని డేటాను బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎలా చేశారు..?
పోలీసు ఉన్నతాధికారి ఫోన్ హ్యాక్ అవ్వడంపై సైబర్ క్రైమ్ నిపుణులు అవాక్కవుతున్నారు. ఓ అధికారి ఫోన్‌ను హ్యాక్ చేయడం అంత సులభం కాదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. హ్యాకర్లు ఆ అధికారిపై వలపువలను విసిరి.. చాటింగ్ చేసి ఉంటారని, ఆ సమయంలో ‘స్టాగినోగ్రఫీ’ ద్వారా ఫోన్‌లో మాల్‌వేర్‌ను చొప్పించి, ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుని ఉం టారని చెబుతున్నారు. ఆ అధికారి తన ఫోన్‌ను హ్యాకర్ల చేతికి ఇస్తే తప్ప..అందులో మాల్‌వేర్‌ను చొప్పించే అవకాశాలు లేవంటున్నారు. ఈ అంశంపై పోలీసు వర్గాలు నోరు మెదపడం లేదు. హ్యాకర్‌ను ఇప్పటికే గుర్తించారని తెలుస్తోంది.