Telangana: సముద్రంలో ఉప్పునకు, చెట్టు మీద ఉసిరికి ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ జాడిలో కలిస్తే అద్భుతమైన ఊరగాయ అవుతుంది. తెలంగాణ విద్యాశాఖ కూడా ఇదే విధంగా ఆలోచిస్తోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ లో సంప్రదాయ కోర్సులను పక్కనపెట్టి కొత్త తరహా విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 18 కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పలు ఆధునిక స్పెషలైజేషన్లతో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏంటి ఆ కొత్త కోర్సులు
బీబీఏలో రిటైలింగ్, లాజిస్టిక్స్ స్పెషలైజేషన్లతో వేరువేరు కోర్సులు చదవచ్చు. బీకాంలో కొత్తగా ఈ కామర్స్ ఆపరేషన్స్, త్రీ స్టోరేజ్ అండ్ సప్లై చైన్ కోర్సులను చదవచ్చు. బీఏ లో కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, పెర్ ఫార్మింగ్ ఆర్ట్స్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా బీఎస్సీలో గేమింగ్, గ్రాఫిక్ డిజైన్ అండ్ అడ్వర్టయిజింగ్, యానిమేషన్ కోర్సులను ప్రవేశ పెట్టారు. ఈ కోర్సులకు ఉన్నత విద్యా మండలి ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 2022-23 నుంచే ఈ కొత్త కోర్సులు అమల్లోకి వస్తాయి.
ఎందుకు ఈ మార్పు
ప్రపంచం మారుతోంది. మనుషుల అవసరాలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మానవ వనరుల అవసరం పెరుగుతోంది. పైగా ఏటా పట్ట భద్రులు భారీ సంఖ్యలో బయటికి వస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు కనుక ఇలాంటి కొత్త కోర్సులను ప్రవేశ పెడుతోంది. పైగా ఈ రంగాల్లో అవకాశాలు అపారంగా ఉండటం, కార్పొరేట్లు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో ప్రభుత్వం కొత్త కోర్సులను ప్రవేశ పెట్టింది. పైగా కంపెనీలకు భారీ రాయితీలు ఇస్తుండటంతో అవి కూడా విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగ శాతం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.