https://oktelugu.com/

Telangana Movement 1948: నిజాం నిరంకుశంపై.. తెలంగాణ అంకుశం: సాయుధ పోరాటంలో ప్రతిఘట్టం అద్వితీయమే

Telangana Movement 1948 : నవ యుగమున నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్ళు? పోలీసు అండను దౌర్జన్యాలు పోషణ పొందేదెన్నాళ్ళు? దమన నీతితో దౌర్జన్యాలకు దాగిలి మూతలింకెన్నాళ్ళు? కంచెయే చేను మేయుచుండగా కాచకుండుటింకెన్నాళ్ళు.. ఎంతటి బాధను పంటి బిగువున భరిస్తే ఇలాంటి వాక్యాలు పుడతాయి? ఎండు డొక్కలు..పుండు రెక్కలు.. బండెనక బండి కట్టి.. పాదాలకు గజ్జెకట్టి.. నిరంకుశానికి.. పైశాచికత్వానికి వ్యతిరేకంగా వెలుగెత్తిన ఉత్సాహం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పాలన […]

Written By:
  • Rocky
  • , Updated On : September 17, 2022 / 11:53 AM IST
    Follow us on

    Telangana Movement 1948 : నవ యుగమున నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్ళు?
    పోలీసు అండను
    దౌర్జన్యాలు పోషణ పొందేదెన్నాళ్ళు?
    దమన నీతితో దౌర్జన్యాలకు దాగిలి మూతలింకెన్నాళ్ళు?
    కంచెయే చేను మేయుచుండగా కాచకుండుటింకెన్నాళ్ళు..
    ఎంతటి బాధను పంటి బిగువున భరిస్తే ఇలాంటి వాక్యాలు పుడతాయి?
    ఎండు డొక్కలు..పుండు రెక్కలు..
    బండెనక బండి కట్టి.. పాదాలకు గజ్జెకట్టి.. నిరంకుశానికి.. పైశాచికత్వానికి వ్యతిరేకంగా
    వెలుగెత్తిన ఉత్సాహం వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పాలన విముక్తి కోసం పోరాటం చేసేలా శక్తిని ప్రసాదించింది.

    Also Read:
    Brahmastra Collections: బ్రహ్మాస్త్ర 8 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

    Telangana Movement 1948

    “పల్లెటూరి పిల్లగాడా, పశువుల గాసే మొనగాడా…పాలు మరచి ఎన్నాళ్ళయిందో”అంటూ నాటి దీనత్వాన్ని..
    “వెట్టి చాకిరీ బాధ బుట్టలో పెట్టేయ్.. గుంపుగా నువ్వొస్తుంటే ఎవరాపగలరోయ్ కూలన్నా” అంటూ సాహిత్యం దీరత్వాన్ని ఇనుమడింపజేసింది.
    “ఓ నిజాం పిశాచమా..కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని.. తీగెలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ”అంటూ కవిత్వం స్ఫూర్తి నింపింది. ఇలా తెలంగాణలో నిజాం నిరంకుశానికి జరిగిన ప్రతీ పోరాటం అనిర్వచనీయం. తరాలు మారినా నేటికీ అనన్య సామాన్యం. “బాంచెన్ దొరా కాళ్ళు మొక్కుతా అంటూ” మోకరిల్లిన తెలంగాణ ప్రజలు ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో తుపాకులు ఎక్కు పెట్టారు. భూమికోసం, భుక్తి కోసం, దోపిడి పాలన విముక్తి కోసం సాయుధ పంథా కొనసాగించారు. 4000 మంది రైతు దళాల యోధులు తెలంగాణ విమోచనం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. చివరికి ఆ యోధుల ఆత్మ బలిదానాలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి సాధించుకుంది. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాం సర్కరోడా అంటూ నినదించి నేడు ఆత్మగౌరవ పతాకాగా ఎగురుతున్నది.

    పోరాటమే తెలంగాణ రక్తంలో ఉంది

    తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి ఉద్యమాలకు ఆలవాలం. నిరంకుశ వాదంపై అలుపెరుగని పోరాటం చేసిన అగ్ని కణం. నిజాం పాలన సాగుతున్న ఆ రోజుల్లోనే ప్రజలు అంటరానితనం, దుర్భర దారిద్రం, వెట్టి బతుకులే తమ నుదుటి రాతగా భావించి మగ్గిపోయేవారు. దొరల గడీల్లో ఏళ్ల తరబడి పాలేగాళ్ళుగా, దొరసానులకు రేయింబవళ్లు సేవలు చేస్తూ బానిసలుగా బతికేవారు. దీనికి తోడు నిజాం నవాబు నిరంకుశ పాలన వల్ల జనం నరకం చూసేవారు. ఖాసీం అనుచరులు ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటమాడేవారు. అలాంటి నిజాం రాకసి మూకలను అత్యంత సాహసోపేతంగా ప్రతిఘటించిన రైతాంగ పోరాటం దొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ పంథాను అనుసరించింది. తెలంగాణ పల్లెల్లో ఒకవైపు భూస్వాములు, రజాకార్ల ఆకృత్యాలపై సాయుధ దళాలు దాడులకు దిగుతుంటే.. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులు కార్మికుల్లో చైతన్యాన్ని కలిగించాయి. ఈ ప్రాంతంలోని దేవులపల్లి శేషగిరిరావు అనే వ్యక్తి ఇల్లందు, కొత్తగూడెం కేంద్రాలుగా బొగ్గు గని కార్మికుల్లో పోరాట చైతన్యాన్ని నింపారు. నిజాం కాలంలోనే కార్మికులను రహస్యంగా సంఘటిత పరిచి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ను స్థాపించారు. భూస్వాములు, పోలీసుల దాడులను తిప్పికొట్టేందుకు శేషగిరిరావు సాయుధ దళానికి నాయకత్వం వహించారు. సాయుధ దళంతో భద్రాచలం ఏరియాలోని నెల్లిపాక అడవుల మీదుగా మణుగూరు వెళ్తున్న క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో శేషగిరి దళం కన్నుమూసింది.

    Telangana Movement 1948

    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పల్లెలకు పరిమితం కాలేదు. బొగ్గు గనుల్లో దుర్భర జీవితాలు అనుభవిస్తున్న కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా నిజాం కు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఖాసీం రజ్వి అనుచరుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. గార్ల, బయ్యారం, ఇల్లందు ప్రాంతాల్లో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. సమయంలోనే ఖాసిం రజ్వీ ఉద్యమకారులను ఊచకోత కోశాడు. ఈ ప్రాంతంలో సుమారు 50 మంది దాకా రజ్వీ సైన్యం ఆగడాలకు బలయ్యారు. గార్ల, బయ్యారం ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని ఖాసీం రజ్వీ నిరంకుశ పాలన సాగించేవాడు.

    Also Read:
    Oke Oka Jeevitham Collections: 7వ రోజు ‘ఒకే ఒక జీవితం’ కలెక్షన్స్.. లెక్కలు చూసి షాక్ లో టీమ్.. ఇంతకీ ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
    గార్ల రైల్వే స్టేషన్ ను రజ్వీ సైన్యాలు తమ ప్రయాణ కేంద్రంగా మార్చుకుని బండ్లకుంట దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో రామినేని వెంకటేశ్వరరావు, శంకర్, బుచ్చి మల్లు, కారం మల్లయ్య వీరుచిత పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించిన ఖాసీం రజ్వి సేనలు భయోత్పాతం సృష్టించాయి. వీరి త్యాగాల ఫలితంగా అమరుల స్తూపాన్ని బయ్యారంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ ప్రాంతం మధిర నియోజకవర్గం పరిధిలోకి వచ్చేది. అప్పట్లో మధిర వరంగల్ జిల్లాలో భాగస్వామ్యంగా ఉండేది. మధిర నియోజకవర్గం లోని ప్రతి ఊరు ఆనాటి నిజాం కు వ్యతిరేకంగా పోరాడింది. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండడంతో అక్కడి పోరాట ప్రభావం మధిరపై కనిపించేది. ఫలితంగా కమ్యూనిస్టులు ఇక్కడ ఆంధ్ర మహాసభ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు. మధిర లోని అల్లినగరంలో ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది అని చరిత్రకారులు చెబుతుంటారు.

    Telangana Movement 1948

    ఈ గ్రామంలో మొదలైన ఉద్యమాన్ని అణచివేసేందుకు ఖాసిం రజ్వీ సేనలు వచ్చాయి. అయితే కమ్యూనిస్టు పార్టీ అందించిన చైతన్యంతో ఆ గ్రామస్తులు ఖాసీం సేనలను ఊర్లో అడుగుపెట్టనివ్వకుండా తరిమికొట్టారు. దీనిని సహించని రజ్వీ సేనలు పాటిబండ్ల వీరయ్య, గుంటముక్కల నారాయణ, వాసిరెడ్డి సూర్యనారాయణ, గొట్టికొండ జాలయ్య, వట్టి కొండ నాగేశ్వరరావు, అనంతరామయ్య ఇళ్లకు ఖాసీం సేనలు నిప్పుపెట్టాయి. దీంతో గ్రామస్తులంతా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని మాచినేని పాలెం వెళ్ళిపోయారు. నేటికీ ఆనాడు తగలబెట్టిన ఇళ్ల చాయలు కనిపిస్తుంటాయి. కమ్యూనిస్టు పార్టీ నేతలు నల్లమల గిరిప్రసాద్, బొమ్మకంటి సూర్యనారాయణ, మల్లు స్వరాజ్యం ఆధ్వర్యంలో ఆనాడు క్యాంపులు నిర్వహించారు. గోవిందపురం గ్రామానికి సమీపంలో ఏడుగురిని కాల్చి చంపి, ఆ తర్వాత వారిని గ్రామానికి తీసుకువచ్చి ఒకే చోట చితిపెట్టి కాల్చేశారు. దానికి చిహ్నంగా గోవిందపురం గ్రామంలో ఒక స్థూపాన్ని నిర్మించారు. మధిర తాలూకాలోని అల్లినగరం, గోవిందపురం, మడుపల్లి, బ్రాహ్మణపల్లి లో ఎంతోమంది సాయుధ రైతాంగ పోరాటంలో కన్నుమూశారు. పుచ్చలపల్లి సుందరయ్య, నల్లమల గిరి ప్రసాద్ వంటి నేతలు క్యాంపులు పెట్టి గ్రామాలను సందర్శించి ఉద్యమంలో మరింత ఉత్తేజం నింపారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న స్థూపాలను చూస్తే ఆనాటి సంఘటనలు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి.

    కవులు తమ రచనల ద్వారా

    100 తుపాకులు ఇవ్వలేని శక్తిని ఒక అక్షరం ఇస్తుంది. ఆ అక్షరమే నిజాం వ్యతిరేక పోరాటంలో ముందుండి నడిచింది. సాయుధ రైతాంగ పోరాటానికి సమాంతరంగా తన శక్తిని తెలంగాణ ప్రజలకు చాటింది. తమ కవితల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నారని ఆరోపిస్తూ నిజాం ప్రభువు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కవులను జైల్లో బంధించారు. అలాంటి వారిలో దాశరధి కృష్ణమాచార్య ఒకరు. ఈయనను నిజామాబాద్ జైల్లో మూడు నెలల పాటు ఉంచారు. ఆ సమయంలో దాశరధి జైలు గోడల పై పళ్ళు తోముకునే బొగ్గుతో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాహిత్యాన్ని రాశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గోడలపై రాశారు. ఈ కవితాంశం అప్పటి నిజాం వ్యతిరేక పోరాటంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తొలి మలి విడత ఉద్యమాల్లో తిరుగులేని ప్రభావాన్ని చూపింది. ఇలా సబండవర్ణాలు ఒక తాటిపైకి వచ్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాయి కాబట్టే తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.

    Tags