బ్రిటిష్ పాలనకు ముందే తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా ప్రాంతాలతో గోండ్వానా రాజ్యం ఏర్పడింది. మరాఠాల పతనం తర్వాత గోండ్వానాను బ్రిటిష్, నిజాం ఆక్రమించారు. దీన్ని గోండులు వ్యతిరేకించేవారు. 1836-1860 దాకా రాంజీగోండ్ నాయకత్వంలో పోరాటం చేసేవారు. ఈ ఉద్యమానికి ఉత్తరాది నుంచి మద్దతు రావడంతో గోండులు తమ పోరాటం ఉధృతం చేశారు. నిర్మల్, పర్బనీ ప్రాంతాలతో పాటు అజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్ వంటి ప్రాంతాలకు విస్తరించారు.
నిర్మల్ కేంద్రంగా చేసుకుని రాంజీగోండ్ చేస్తున్న పోరాటం అటు బ్రిటిష్, ఇటు నిజాం లకు నచ్చేది కాదు. దీంతో ఆయనను అంతమొందించాలని ప్రణాళిక రచించారు. అప్పటికే సోన్ ప్రాంతంలో రాంజీగోండ్ రైతులకు శిక్షణ ఇచ్చేవారు. దీంతో వీరిని దెబ్బతీయడానికి నిజాం బ్రిటిష్ వారి సాయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి విచారణ పేరుతో కొంతమందిని తీసుకొచ్చి నిర్మల్ నుంచి ఎల్లపెల్లి వెళ్లే మార్గంలో ఉండే మర్రి చెట్టుకు ఉరి తీసేవారు. దీంతో వీరి ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసేవారు.
ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి నిర్మల్ పర్యటన సందర్భంగా ఈ వెయ్యి ఉరుల మర్రికి ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్ షా దీనిపై స్పందిస్తారా? ఏమైనా మాట్లాడి ప్రజల్లో చైతన్యం కలిగిస్తారా? అనే విషయాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ అమరవీరుల గురించి పుంఖానుపుంఖాలుగా మాట్లాడుతున్న నేతలు ఈ మర్రి చెట్టు ఉదంతంపై ఎందుకు మరిచిపోతున్నారని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇంత పెద్ద ఉదంతాన్ని కనీసం గర్తు పెట్టుకునే విధంగా చేస్తారా లేదా అనేదే సంశయం.
1860 ఏప్రిల్ 8న రాంజీగోండ్ తన అనుచరులతో నిర్మల్ సమీపంలో ఉన్నట్లు తెలుసుకున్న బ్రిటిష్ వారు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడించి. దాదాపు రెండు రోజులు భీకర పోరు జరిగింది. మొదటి రోజు రాంజీగోండ్ దే ఆధిప్యతం అయినా రెండో రోజు మాత్రం ఇంకా ఎక్కువ బ్రిటిష్ సేనలు రావడంతో రాంజీగోండ్ వారికి బందీగా చిక్కాడు. దీంతో ఆయనతో పాటు వెయ్యి మందిని మర్రిచెట్టుకు ఉరి తీసి అప్పటి కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఇంత పెద్ద దారుణం జరిగినా అది ప్రపంచానికి తెలియలేదు. దీంతో జలియన్ వాలా బాగ్ కంటే ముందే జరిగినా దీని గురించి ఏ చరిత్ర పుస్తకాల్లోనూ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
భరత మాత సంకెళ్లు తెంచడానికి స్వాతంత్ర్య పోరాటం జరిగిందని తెలిసినా ఇంత పెద్ద దురంతం జరిగినా ఇంత వరకు దీని గురించి ఎందుకు చరిత్రలో చేర్చలేదో అర్థం కావడం లేదు. తరువాత కాలంలో కుమురం భీం చేపట్టిన ఉద్యమాన్ని గుర్తించిన చరిత్ర దీన్ని ఎందుకు విస్మరించిందో అర్థం కావడం లేదు. ఆయన చూపిన తెగువ చూస్తుంటే ఆయనలో స్వాతంత్ర్య కాంక్ష ఎంత బలంగా ఉండేదో అర్థమవుతోంది. ఏకంగా వెయ్యి మంది ప్రాణత్యాగాలు చేయడం మామూలు విషయం కాదు.
రాంజీగోండు బ్రిటిష్ సైన్యంతో సాగించిన పోరు సామాన్యమైనది కాదు. ఎందరో వీరులకు, యోధులకు స్ఫర్తిగా నిలిచిన రాంజీగోండు జీవన విధానంపై ఇంత వరకు ఏ పుస్తకాల్లోనూ కనిపించకపోవడం విడ్డూరం. తెలంగాణ ఉద్యమ సమయంలో 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్తూపం, 2008 నవంబర్ 14న నిర్మల్ చైన్ గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహం నెలకొల్పి చేతులు దులుపుకున్నారు. నాలుగేశ్ల క్రితం మోడీ ప్రభుత్వం రాష్ర్టంలో రాంజీ గోండు పేరిట గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పినా అది నెరవేరలేదు.