Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పండగ నడుస్తోంది. మొన్నటి వరకు హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఫుల్ ఎంజాయ్ చేసిన లీడర్లు.. మళ్లీ స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవానికి టీఆర్ఎస్ నాయకులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అందరినీ బెంగళూరు తీసుకుని వెళ్లారు. సుమారు 1200మంది ఓటర్లు టీఆర్ఎస్ తరఫున వారు ఉండగా.. సగానికి పైగా ప్రస్తుతం క్యాంపులోనే ఉండడం విశేషం. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు లోకల్ ఎమ్మెల్యేలు కూడా రెండు మూడు రోజలకు ఓసారి క్యాంపునకు వెళ్లి.. వారి మంచిచెడ్డలు చూసుకుని మళ్లీ వస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు వెళ్తూ.. వారి నియోజకవర్గ లోకల్ లీడర్లకు ఏం తక్కువ కాకుండా మర్యాదలు చేసుకుంటూ వస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల నాయకులను మంత్రి గంగుల కమలాకర్ బెంగళూరులోని రిసార్టుకు కుటుంబ సమేతంగా తరలించారు. అక్కడే వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఉదయాన్నే టిఫిన్ నుంచి మొదలు పెడితే.. రాత్రి మర్యాదల వరకు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఓవరాల్ బాధ్యత మంత్రి చూసుకుంటుండగా… ప్రతీ నియోజకవర్గం ఎమ్మెల్యే వారివారి లోకల్ లీడర్లను ప్రసన్నం చేసుకుని ఓటు జారిపోకుండా చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు వెళ్లిన క్యాంపు ఫొటోలు ఈమధ్య మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతినిధులు చిందేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ ఓట్లను సీట్లను కాపాడుకోవడానికి తమ పార్టీవాళ్లకే ఇంత మర్యాద చేస్తున్న అధికార పార్టీ.. ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. కొద్దిరోజులుగా మంత్రులు సహా.. లోకల్ లీడర్లు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read: ధరణిలో విదేశీ హస్తం.. రాములమ్మ సంచలన ఆరోపణలు..!
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్లే కాకుండా కాంగ్రెస్ నాయకులు సైతం క్యాంపు రాజకీయాలు జోరుగానే సాగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చాలామంది కాంగ్రెస్ లీడర్లు గోవాకు ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపునకు వెళ్లారు. వీరు ఉమ్మడి జిల్లాలో రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటుండగా.. ప్రస్తుతం మెజారిటీ నాయకులు గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. లోకల్లో ఉంటే.. అధికార పార్టీ నాయకులు గాలం వేసి లాక్కునే పరిస్థితి ఉంటుందని భావించిన కాంగ్రెస్ నాయకులు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఉండగా.. వీరందరూ నేరుగా పోలింగ్ బూత్ కు రానున్నారు. ఎన్నికల్లో ఓటు వేసే పద్ధతిని కూడా అక్కడి క్యాంపుల్లో పాఠాలు వివరించడం విశేషం.
Also Read: కేసీఆర్ లో ఆందోళన అందుకేనా? ఏమైందిలా?