Swachh Bharat Mission: వ్యక్తిగత శుభ్రత దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పరిసరాల శుభ్రత సమాజానికి మేలు చేస్తుంది. దురదృష్టవశాత్తు మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరు బయట మలవిసర్జన సర్వసాధారణం అయిపోయింది. దీనివల్ల వివిధ రకాల వ్యాధులు విజృంభించేవి. దీనికి తోడు ఆరు బయట మల విసర్జన వల్ల స్త్రీల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగేది. అయితే ఈ దశలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. భారీగా నిధులు కేటాయించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఫలితంగా దేశం మొత్తం ఓడిఎఫ్ ప్లస్ కేటగిరి జాబితాలోకి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడించింది.
50% గ్రామాలు..
స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా దాదాపు 50 శాతం గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ స్థాయికి చేరాయి. ఇందులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది. బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తి పొందిన ఈ గ్రామాలలో ఘన లేదా ద్రవ వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థ అమల్లో ఉంటే దానిని ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా పిలుస్తారు. మే 10 నాటికి దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలోకి చేరుకున్నాయి. ఇందులో తెలంగాణలో అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ కేటగిరిలో ఉండటం విశేషం. ఇలా నూరు శాతం ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
తర్వాత స్థానం కర్ణాటక
ఇక తెలంగాణ తర్వాత ఓడిఎఫ్ ప్లస్ విభాగంలో రెండవ స్థానంలో కర్ణాటక 99.5%, తమిళ నాడు 97.8%, ఉత్తర ప్రదేశ్ 95.2% , ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ చివరి స్థానంలో ఉండడం విశేషం. ఇక చిన్న రాష్ట్రాల్లో గోవా 95.3%, సిక్కిం 69.2% తో అత్యుత్తమ పనితీరు కనబరిచాయని కేంద్ర నివేదిక చెబుతోంది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, లక్షద్వీప్ లలో 100% గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదా పొందాయి.
ఆరోగ్యాలు మెరుగవుతున్నాయి
ఒకప్పుడు దేశంలో అంటువ్యాధులు తీవ్రంగా ప్రభలేవి. దీనివల్ల మరణాలు చోటు చేసుకునేవి. అయితే వీటికి ప్రధాన కారణం ఆరు బయట మల విసర్జన. దీనికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించింది. ఇప్పుడు దీని ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మల్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఉండేది. అయితే అధికారుల అవినీతి వల్ల ఈ కార్యక్రమం పెద్దగా విజయవంతం కాలేదు. అప్పట్లో ఈ పథకానికి సంబంధించి రాష్ట్రాల భాగస్వామ్యం అంతంత మాత్రమే ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంతో ఈ పథకం విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఈ పథకానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్లుగా సమాజంలో విశేషాలు పొందిన వ్యక్తులను కేంద్రం నియమించడంతో.. ఈ పథకం ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళింది. ప్రస్తుతం దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.