
భారతదేశంలో రాజకీయం కులాలు, మతాల ప్రాతిపదికన సాగుతుందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ దేశ ప్రజలు కులాలుగా విడిపోయి, కనిపించని కంచెలు అడ్డుగా వేసుకొని బతుకుతున్నారనే ఆవేదన వ్యక్తంచేస్తుంటారు మేధావులు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవే కులాలను నాయకులు పెంచి పోషిస్తుంటారనే విమర్శలు కూడా చేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం కులాల వారీగా భవనాలను నిర్మించుకునేందుకు స్థలాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతంలో బీసీలు, ఎస్సీల కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి కమ్మ, వెలమ కులసంఘాల భవనాలకు స్థలం కేటాయించింది. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న అయ్యప్ప సొసైటీ ఏరియాలో దాదాపు వంద కోట్ల రూపాయలకుపైగా విలువ ఉండే.. ఐదు ఎకరాలను కేటాయించింది.
అనుకున్నదే తడవుగా ఆదేశాలు జారీచేయడం.. సీసీఎల్ ఏ ఆమోదించడం.. ఉత్తర్వులు ఇవ్వడం అన్నీ చకచకగా జరిగిపోయాయి. ఇంత అత్యవసరంగా ఈ రెండు కులాలకు భూమి కేటాయించడంపై చర్చ మొదలైంది. భూమి కేటాయించడం ఒకెత్తయితే.. జూబ్లిహిల్స్ ప్రాంతంగానే భావించే అయ్యప్ప సొసైటీలో వంద కోట్లపైన విలువైన స్థలం ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
ఇప్పటికే.. పలు కుల సంఘాలకు కేటాయించిన భూములపైనే కొందరు కోర్టు మెట్లు ఎక్కారు. చాలా భూముల వివాదం ఇంకా కోర్టులోనే నలుగుతోంది. అలాంటిది.. ఇంత ఖరీదైన భూమిని కేటాయిస్తే.. కోర్టు కేసులు రాకుండా ఉంటాయా? ఎవరో ఒకరు పిల్ వేయడం తథ్యమనే చర్చ కూడా సాగుతోంది.
కాగా.. ఈ కుల సంఘాల భవనాల వల్ల సామాన్యులకు ఉపయోగం ఏంటీ? అనే ప్రశ్నలు ఎంతో కాలంగా ఉన్నాయి. నిజానికి.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన సామాన్యులకు, తమ కులానికి చెందిన భవనంతో ఎలాంటి సంబంధమూ ఉండదు. కనీసం.. వారు అందులో కాలు కూడా పెట్టలేరు. ఎవరు నిర్వహిస్తారో..? ఆ భవనాల కమిటీ సభ్యులు ఎవరో? ఎవరు ఎన్నుకుంటారో? అందుకు ప్రాతిపదిక ఏమిటో? ఎవ్వరికీ తెలియదు. కానీ.. భవనాలు మాత్రం వెలుస్తుంటాయి. కేవలం రాజకీయంగా కులాలకు ఏదో చేస్తున్నామని చెప్పుకొని, ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే.. వాటికి కోట్లాది రూపాయల విలువైన ప్రజాభూములను ధారాదత్తం చేయడం మాత్రం ఖచ్చితంగా విమర్శల పాలవుతుంది.
