తెలంగాణ ప్రభుత్వం భూములను అమ్ముకుని ఆదాయం సమకూర్చకుంటోంది. భవిష్యత్ తరాలకు భూములే లేకుండా చేస్తోంది. ప్రభుత్వ భూమి కనిపించకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో రాబోయే కాలంలో ప్రభుత్వానికి అవసరం అయినా భూమి దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భూముల అమ్మకంపై పెద్ద దుమారమే రేగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధనిక తెలంగాణ అన్నప్పుడు భూములు అమ్మాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత విలువైన కోకాపేట భూముల్ని వేలం వేసింది. రేటు కూడా అత్యధికంగా పలికింది. కోకాపేటలో దాదాపు 50 ఎకరాల హెచ్ఎండీఏ వేలం వేసింది. గరిష్టంగా ఒక ఎకరాకు రూ.60 కోట్లు ధర పలికింది. అత్యల్పంగా రూ.31 కోట్లకు హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమెటెడ్ ఎకరం భూమి కొనుగోలు చేసింది. వేలంలో అత్యధికధర పెట్టిన కొనుగోలు చేసిన కంపెనీ ఆక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్. ఈసంస్థ 16.5 ఎకరాలను సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సత్యనారాయణ రెడ్డి మన్నె దాదాపుగా 8ఎకరాల భూమి సొంతం చేసుకున్నారు.
ప్రిస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏడున్నర ఎకరాలు, ఇక శ్రీ చైతన్యకు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఏడున్నర ఎకరాలు కొనుగోలు చేసింది. హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎకరం స్థలాన్ని దక్కించుకుంది. దాదాపుగా పదిహేడు ఎకరాలు కొన్న ఆక్వా స్పేస్ సంస్థ మైహోం గ్రూపునకు చెందింది. ఎకరం కొన్న హైమా డెవలపర్స్ కూడా వారిదే. ఇక వ్యక్తిగత హోదాలో భూములు కొన్న సత్యనారాయణ రెడ్డి మన్నె ఎంఎస్ఎస్ ఫార్మా కంపెనీ యజమాని. ఆయన కుటుంబసభ్యుడు టీఆర్ఎస్ ఎ:పీగా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఒకరిద్దరు తప్ప టీఆర్ఎష్ ప్రభుత్వంతో సన్నిహితంగాుండే వారికే భూములు దక్కాయి. అయితే ఇందులో అక్రమాలు జరిగినట్లుగా ఎలాంటి ఆరోపణలు రాలేదు.
ఎకరానికి అరవై కోట్లకు పైగా వచ్చాయి ఒక్కరోజులోనే నాలుగు వందల కోట్ల ఆదాయం సమకూరింది. భూముల వేలం కొనసాగుతుంది. మొత్తంగా ఐదు వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. కొనుక్కునే వారు ప్రభుత్వ పెద్దల సన్నిహితులే అయినా పద్ధతిగా కొనుగోలు చేస్తున్నారు. విమర్శలు మాత్రం వస్తున్నాయి. శుక్రవారం ఖానామెట్ లో ఉన్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. వీటిని కూడా మై హోం గ్రూపే దక్కించుకునే అవకాశం ఉంది.