
తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి కోలుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఇళ్లలో ఉంటూ సహకరిస్తుండటంతో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన రెండుమూడురోజులుగా తెలంగాణలో సింగిల్ డిజిట్ దాటకపోవడం ఇందుకు నిదర్శనంగా కన్పిస్తుంది. బుధవారం తెలంగాణలో ఏడు కేసులు నమోదు కాగా ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నిన్నటి వాటితో కలుపుకొని మొత్తంగా తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 1016కు చేరింది. ఇందులో 25మంది మృతిచెందగా 409మంది కోలుకున్నారు. మరో 582మంది చికిత్స పొందుతున్నారు.
4 నుంచి రాష్ట్రానికి కేంద్ర బృందం…!
తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా రహితంగా ఉన్న 11జిల్లాలను ప్రకటించింది. వీటిలో వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగే సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, నారాయణపేట్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన వారెవరూ ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందడం లేదని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఎనిమిది జిల్లాల్లో కరోనా బారిన బాధితులు కోలుకోని ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలోని 33జిల్లాల్లో 11జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉంటే తెలంగాణలో గత వారంతో పోలిస్తే పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ వారం రోజుల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం 11కేసులు నమోదు కాగా, సోమవారం రెండు, మంగళవారం ఆరు, బుధవారం ఏడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండటంతో రాష్ట్రం మొత్తంగా కరోనా కేసులు కట్టడిలో ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే మే 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.