Telangana Employees: దసరా పండుగ దగ్గరకొస్తోంది. ఉద్యోగులకు వేతనాలు, వృద్ధులకు పింఛన్లు మాత్రం ఇంకా అందలేదు. దీంతో పండుగ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ పూట ఖర్చులుంటాయని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సి ఉన్నా ఆ సంప్రదాయానికి ప్రభుత్వం కత్తెరేసింది. ఇష్టమొచ్చినట్లు చెల్లిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ మరో వారం రోజుల్లో జరగాల్సి ఉన్నా వేతనాలు మాత్రం ఇంకా అందకపోవడం గమనార్హం.

ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లించడంలో ఆలస్యమవుతోంది. దీంతో వారు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. పండుగ పూట కూడా పస్తులేనా అనే ధోరణిలో ఉద్యోగులు మునిగిపోయారు. ప్రభుత్వ నిర్వాకంపై ఏం మాట్లాడలేకపోతున్నారు. పండుగ దగ్గరకొస్తున్నా పైసల్లేకపోవడంతో ఎలా అని మథనపడుతున్నారు. పిల్లలకు బట్టలు, ఇంట్లోకి సరుకులు ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ధనిక రాష్ర్టమని చెబుతున్న నేతలు వేతనాలు అందించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటున్నారని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్ జిల్లాలకు తప్ప మిగతా వాటికి ఇంకా వేతనాలు అందించలేదు. దీంతో ఉద్యోగులు ఎప్పుడిస్తారోనని ఎదురు చూడక తప్పడం లేదు.
దసరా ఈనెల 15న ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పైసలు ఎలా అని అందరిలో ఒకటే ఆతృత. గత ముప్పై ఏళ్లుగా రాని సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో ఏ ప్రభుత్వం ఆలస్యం చేయకున్నా ఇప్పుడు తెలంగాణ ఆలస్యం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుపై బహింరగంగా విమర్శించకున్నా లోపల మాత్రం బాధ పడుతున్నారు.