Telangana Elections 2023: ఒకే పార్టీకి టిడిపి, వైయస్ఆర్సీపీ మద్దతు..

రాష్ట్రంలో పరిస్థితి ఒక విధంగా ఉంటే.. ఖమ్మంలో మాత్రం మరో విధంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో బద్ధ శత్రువులైన వైఎస్ఆర్సిపి, టిడిపి ఇక్కడ ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండడం విశేషం.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 9:29 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రకు సరిహద్దున ఉన్న ఖమ్మం జిల్లాలో టిడిపి, వైఎస్ఆర్సిపి ఒకే పార్టీకి మద్దతు ఇవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో సహజంగానే ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువ. ఈ జిల్లాలో ఎక్కువ శాతం సెటిలర్స్ ఉన్నారు.. కమ్మ, రెడ్డి, కాపు, ఇతర కులాలకు చెందిన వారంతా కూడా ఈ ప్రాంతానికి ఎప్పుడో వచ్చారు. ఇక్కడ రకరకాల వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. సహజంగానే వీరిపై ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హవా కొనసాగితే.. ఇక్కడ మాత్రం ఒకసారి వైఎస్ఆర్సిపి, మరోసారి టిడిపి, కాంగ్రెస్ పార్టీలు సత్తా చూపించాయి. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్, టిడిపి ల నుంచి గెలిచిన అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో..

ఇక రాష్ట్రంలో పరిస్థితి ఒక విధంగా ఉంటే.. ఖమ్మంలో మాత్రం మరో విధంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో బద్ధ శత్రువులైన వైఎస్ఆర్సిపి, టిడిపి ఇక్కడ ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండడం విశేషం. ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ఆ పార్టీ సానుభూతిపరులు కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు.. ఖమ్మం నియోజవర్గంలో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందుకు కారణం తాము వేసిన ఓట్లే అని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇక పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అటు వైఎస్ఆర్సిపి, ఇటు టిడిపి, వైయస్ఆర్టీపీ కూడా మద్దతు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలోనూ తమ వంతు పాత్ర పోషించాయి. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ ఇవే పార్టీలు ప్రచారం కూడా చేశాయి.. ఇల్లందు అభ్యర్థి కోరం కనకయ్య, భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య, పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట అభ్యర్థి జారే ఆదినారాయణ, వైరా అభ్యర్థి రాందాస్ నాయక్, కొత్తగూడెం అభ్యర్థి కూనంనేని సాంబశివరావు వంటి వారి విజయాలను కాంక్షిస్తూ టిడిపి, వైఎస్ఆర్సిపి ప్రచారం చేయడం విశేషం.

ఇక్కడ మిత్రులే

బద్ధ శత్రువులుగా ఉండే టిడిపి, వైఎస్ఆర్సిపి నాయకులు.. తెలంగాణలో మాత్రం కలివిడిగా ఉంటారు. ఖమ్మంలో ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్నారు. విజయం సాధించకపోయినప్పటికీ గణనీయమైన ఓట్లు సాధించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలలో వారు అదే ధోరణి ప్రదర్శించారు. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి నాయకుల ఆగడాలు పెరిగిపోయిన నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలంటే తాము ఐక్యంగా ఉండాలని వారు ఈ నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి ఆ ఐక్యతా రాగం ఫలితం ప్రస్తుతం కనిపిస్తోంది. రెండు పార్టీల్లో ఉన్న నాయకులు మొత్తం రెండవ మాటకు తావు లేకుండా మద్దతు ప్రకటించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు.