Telangana Elections 2023: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడు. నేటి తరం నేతలు దీనిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దీంతో నేటి మిత్రులు.. రేపటి శత్రువులుగా.. నేటి శత్రువులు.. రేపటి మిత్రులుగా మారుతున్నారు. ఉదయం వరకు ఉన్న పార్టీని సాయంత్రానికి వదిలేస్తున్నారు. చొక్కాలు మార్చినట్లుగా జెండాలు, కండువాలు మార్చేస్తున్నారు. అజెండాలు వదిలేస్తున్నారు. ఇదేంటని అడిగితే అదే కదా రాజకీయం అంటున్నారు. సిద్ధాంతాలు.. భావోద్వేగాలు.. వంటివన్నీ కేవలం మాటలకే పరిమితం.. ప్రస్తుతం నేతల్లో కనిపిస్తున్నది స్వార్థం ఒక్కటే. తెలంగాణ ఎన్నికల వేళ ఇలాంటి స్వార్థ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ భవిష్యత్ కోసం కొందరు, పదవుల కోసం మరికొందరు పార్టీలు మారుతున్నారు. తెలంగాణలోని ప్రధాన పార్టీల్లో ప్రస్తుతం ఇదే రాజకీయం జోరుగా సాగుతోంది. పార్టీ, తమను నమ్ముకున్న కార్యకర్తల, తమకు ఓటేసి గెలిపించిన ప్రజలు ప్రయోజనం కన్నా.. సొంత మేలు కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారు. అధిష్టానాలను ధిక్కరిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలోని ఏ పార్టీలో ఏ లీడర్ తీరు ఎలా ఉందో చూస్తే స్వార్థం నేతల్లో స్వార్థం ఎంతలా ఉందే అర్థమవుతుంది.
నేనే.. మేము.. మాకు..
నేను.. సేఫ్‌గా ఉంటే చాలు.. నా కుటుంబం బాగుపడితే చాలు.. నాకు పదవి వస్తే చాలు పార్టీ ఏమైతే మాకేంటి? మాకు మంచి జరిగితే ఓకే.. లేదంటే నాట్ ఓకే అన్నట్లు తయారైంది నేతల తీరు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. తేడా జరిగితే జంప్ చేసేయడమే.. నిన్నటి వరకు తిట్టిన నోరే.. నేడు జైకొడుతుంది.. విమర్శలు స్థానంలో ప్రశంసలు కురిపిస్తుంది.. తెలంగాణ ఎన్నికల్లో ఈ సిత్రాలు మరీ ఎక్కువయ్యాయి. గతంలో గెలిచాక పార్టీలు మారిన నేతలు కొందరైతే.. ఇప్పుడు గెలుపు ఆశతో గోడ దూకుతున్న నేతలే ఎక్కువవుతున్నారు. ఐదేళ్లుగా రాసుకుపూసుకు తిరిగిన పార్టీని.. తమ వర్గంగా చెప్పుకున్న నేతలను ఒక్క క్షణంలో వదిలేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకం కాదు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదేపరిస్థితి.. ఐతే బీజేపీలో ఈ జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.
స్వప్రయోజనాల కోసమే..
అధికార బీఆర్‌ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ఈటల రాజేందర్ అధినేత కేసీఆర్‌ను విభేదించి కమలం పార్టీలో చేరారు. తనతోపాటే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకువెళ్లారు. బీజేపీలో కీలక నేతగా మారారు ఈటల.. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం తయారుచేసుకున్నారు. తన ప్రధాన అనుచరుడు ఏనుగు రవీందర్‌రెడ్డితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈటల వర్గంలో చురుగ్గా వ్యవహరించేవారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి దించేవరకు విశ్రమించకుండా పోరాడింది ఈటల వర్గం.. తాము అనుకున్నది సాధించిన తర్వాత పార్టీ బలపేతానికి కృషి చేయాల్సిన ఈటల వర్గం ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకునే పనిలో పడ్డారు. ఈటల వర్గంలో యాక్టివ్‌గా ఉన్న ప్రధాన నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీని వీడారు. బండిని దించే వరకు కలిసివున్న ఈ నేతలు చివరికి తమ సొంత నియోజకవర్గాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్‌లో విచిత్రమైన పరిస్థితులు
ఇక కాంగ్రెస్‌లో మరీ విడ్డూరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం కత్తులు దూసుకునే నాయకులు ఇప్పుడు ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. ఇన్నాళ్లు కలిసిమెలిసి తిరిగిన వారు తమ పక్కనున్న వారికి పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంతా అనుకుంటారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై గతంలో ఒంటికాలిపై లేచిన సీనియర్లు ఇప్పుడు అవసరాలు, అవకాశాలే లక్ష్యంగా సర్దుకుంటున్నారు. 50 కోట్ల రూపాయలకు పీసీసీ పీఠం కొనుక్కున్నారని రేవంత్‌రెడ్డిని విమర్శించిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌తో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రెండు టికెట్లు సాధించుకున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్‌కు వంతపాడుతున్నారు. చాలామంది లీడర్లు మొదట్లో రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించినా.. ఎన్నికలు సమీపించడంతో చేతులు కలిపారు.
బీఆర్‌ఎస్ అసంతృప్తులు జంప్..
ఇలా రెండు ప్రతిపక్ష పార్టీల్లో వర్గాలు విచ్ఛిన్నమవుతుండగా.. అధికార బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు పార్టీని చికాకు పెడుతున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తుండగా.. టిక్కెట్లు దక్కని వారు గోడదూకేస్తున్నారు. సిట్టింగ్ రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, మైనంపల్లి హన్మంతరావుతోపాటు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. పొంగులేటి, తుమ్మల, జూపల్లి అంతకు ముందే గులాబీ బాస్‌కు షాక్ ఇచ్చారు. తాజాగా జలగం వెంగళరావు కూడా పార్టీని వీడారు. మొత్కుపల్లి నర్సింహులు లాంటి సీనియర్లు కూడా స్వ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ను వీడారు. జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మను కూడా గులాబీకి గుడ్‌బై చెప్పారు. ఎన్నికల వేళ ఈ రంగులు మార్చే స్వార్థ రాజకీయమే క్లియర్‌కట్ హాట్‌టాపిక్.