Telangana Election Results 2023: తమ్మినేని ఓడిపోయాడు.. కూనంనేని గెలిచాడు

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ ఎన్నికల్లో పాలేరు శాసనసభ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ ఆయన ఐదువేలకు మించి ఓట్లను సాధించలేకపోయారు. ఫలితంగా ఆయన ఓటమి పాలయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 5:42 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: ఈ ఎన్నికలు రకరకాల సంచలనాలకు వేదికయ్యాయి. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కమ్యూనిస్టుల ప్రవేశం గురించి.. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకు శాసనసభలో కమ్యూనిస్టులకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. నాగార్జునసాగర్ నుంచి గతంలో నోముల నరసింహ గెలిచినప్పుడు కమ్యూనిస్టు పార్టీకి ప్రాతినిధ్యం ఉండేది. తర్వాత ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా శాసనసభలో వామపక్ష నాయకులకు చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈసారి కమ్యూనిస్టు పార్టీ నుంచి ఒక నాయకుడు శాసనసభలో అడుగుపెట్టనున్నాడు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ ఎన్నికల్లో పాలేరు శాసనసభ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ ఆయన ఐదువేలకు మించి ఓట్లను సాధించలేకపోయారు. ఫలితంగా ఆయన ఓటమి పాలయ్యారు. పాలేరు నియోజకవర్గం లో జరిగిన పోటీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. వాస్తవానికి ఇక్కడ పోటీ చేసిన తమ్మినేని వీరభద్రం మొదటి నుంచి కూడా పెద్దగా ఆసక్తిగా కనిపించలేదు. కాకపోతే పోటీ చేయాలి కాబట్టి బరిలో నిలిచారు. అదే భారత రాష్ట్ర సమితితో గనుక పొత్తు కుదిరి ఉంటే ఆయన పోటీకి దూరంగా ఉండేవారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ బంధం అప్పటినుంచి కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అవసరం తీరిన తర్వాత కేసీఆర్ వారిని దూరం పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదురుతుంది అని అనుకుంటున్న తరుణంలో.. అది చివరికి ఫెయిల్ కావడంతో పోటీకే తమ్మినేని వీరభద్రం మొగ్గు చూపారు. కానీ ఆయన పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి రాష్ట్ర కార్యదర్శి హోదాలోనూ ఆయన విజయం సాధించలేకపోయారు.

అవకాశాన్ని అనుకూలంగా మలుచుకున్న సాంబశివరావు

ఇక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా సాంబశివరావు వైపు ఉండి ప్రచారం సాగించారు. వారి ఓట్లు కూడా క్రాస్ కాకుండా సాంబశివరావుకు వేశారు. ఫలితంగా సాంబశివరావు విజయం సాధించారు. ఈ విజయంతో ఎమ్మెల్యేగా మొదటి సారి తెలంగాణ శాసనసభలో సాంబశివరావు అడుగుపెడుతున్నారు. గతంలో ఆయన 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. కాగాసాంబశివరావు విజయ సాధించిన పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సిపిఐ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.