రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. మళ్లీ తిరిగి లేవొద్దు అన్నట్టుగా తొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సీనియర్’ అనే బోర్డు మెడలో వేసుకున్న నేతలు ఏం చేయాలి..? తమ అనుభవాన్ని ఉపయోగించి పార్టీని బతికించేందుకు కృషిచేయాలి. కానీ.. హస్తం పార్టీలోని సీనియర్ బ్యాచ్ తీరు చూస్తుంటే.. సొంత పార్టీ కేడర్ తోపాటు అందరికీ విస్మయం కలుగుతోంది.
తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ప్రజలకు చెప్పుకోలేక తొలిసారి ఓడిపోయారు. టీఆర్ఎస్ ప్రజలకు ఏమీ చేయలేదన్న విషయం చెప్పుకోలేక రెండోసారి ఓడిపోయారు. ఈ క్రమంలోనే కొందరు కారెక్కేశారు. ఉన్నవాల్లూ సైలెంట్ అయ్యారు. ఓ కార్యక్రమం లేదు.. కేడర్లో జోష్ లేదు.. దీంతో.. పార్టీ బాగుపడుతుందన్న ఆశ కూడా సన్నగిల్లుతున్న పరిస్థితి. ఇలాంటి కండీషన్లో హస్తం నేతలు కూడా కీచులాడుకోవడం మానట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులు ఎత్తేయడంతో.. పీసీసీ అధ్యక్షుడి పదవికోసం మొదలైన పంచాయితీ.. ఇప్పటి దాకా తెగలేదు. తెలంగాణ వచ్చిన కానుంచి ఇప్పటి వరకు అధికార పార్టీని నేరుగా ఎదుర్కొన్న నేత కాంగ్రెస్ లో లేడన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయమే. అందుకే.. పీసీసీ చీఫ్ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. అంతేకాదు.. అది బలంగా కూడా ఉంది. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం రేవంత్ వల్లనే అవుతుందన్నది శ్రేణుల నమ్మకం. కానీ.. దీనికి మోకాలడ్డుతున్నారు సీనియర్లు.
బయట పార్టీ నుంచి వచ్చిన ఆయనకు ఎలా ఇస్తారన్నది వాళ్ల లా పాయింటు. పార్టీలో సీనియర్లము లేమా? అన్నది మరో డబుల్ లా పాయింటు. మరి, ఈ పాయింట్లతో వీళ్లు ఇన్నాళ్లు ఏం చేశారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే మాత్రం.. సమాధానం ఉండదు. పీసీసీ కిరీటం మాత్రం తమకే కావాలని పంచాయితీ పెడుతుంటారు. చేయడానికి ఏమీ లేకపోయినా.. పీసీసీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్లో కూర్చోవాలి అన్నట్టుగా సీనియర్లు వ్యవహరిస్తున్నారని సాక్షాత్తూ ఆ పార్టీ కార్యకర్తలే బాహాటంగా విమర్శిస్తున్నారు.
అసలే పరిస్థితి బాగోలేదని అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. కానీ.. ఇలాంటి సమయంలో దూకుడుగా వ్యవహరించి, పార్టీని ముందుకు తీసుకెళ్లే రేవంత్ కే పగ్గాలు అప్పగించాలని భావిస్తోందనే మాట వినిపిస్తోంది. కానీ.. సీనియర్లు మాత్రం ససేమిరా అంటున్నారట. తాము సహకరించబోమని బెదిరింపులకు దిగుతున్నారట. హనుమంతరావు వంటివారు లేఖలు కూడా రాస్తున్నారట. ఇన్నాళ్లూ పార్టీకి విధేయతగా ఉన్నవారికే పీఠం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఆ విధేయతతో పగ్గాలు అప్పగిస్తే.. పార్టీకి ఒరిగేది ఏంటన్నది కేడర్ సూటి ప్రశ్న. మరి, ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.