Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ నేతలు అర్జంట్‌గా హస్తినకు వెళ్లారు. అత్యవసరంగా రావాలని ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తోపాటు పలువురు సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మధ్యాహ్నం వీరితో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ ఆంతర్యం ఏమిటన్న చర్చ ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల్లో జరుగుతోంది. మరోవైపు అధికార బీఆర్‌ఎస్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది.
సమావేశాల నిర్వహణ ఇతరులకు..
తెలంగాణలో గత పక్షం రోజులుగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. వీటికి మంగళవారం ముగిపు పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేశారు. కీలక నేతలు కూడా కొన్ని సభలకు చీఫ్ గెస్టులుగా హాజరుకావాల్సి ఉంది. కానీ, సోమవారం ఉదయమే అమిత్‌షా ఆఫీసు నుంచి రాష్ట్ర నేతలకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చింది. కార్నర్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పినా.. వాటిని వేరే నేతలకు అప్పగించాలని హైకమాండ్ చెప్పడంతో వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించి ఢిల్లీ బయల్దేరారు..
ఎజెండా ఏమిటన్న ఉత్కంఠ..
అమిత్‌షాతో మీటింగ్ ఎజెండా ఏమిటనే విషయాన్ని రాష్ట్ర నేతలకు చెప్పకపోయినా.. అత్యవసరమైన ఎజెండాపైనే మీటింగ్ ఉంటుందనే సంకేతాలను ఢిల్లీ పెద్దలు ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని బీజేపీ పెద్దలకు సమాచారం వచ్చి ఉంటుందని అందుకే పిలిపించారని కొంత మంది భావిస్తున్నారు. ఉన్న పళంగా ఎన్నికలకు సిద్ధమయ్యేలా అమిత్‌షా సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
కవిత అరెస్ట్‌పైనా చర్చించే చాన్స్..
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాములో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. తర్వాత వంతు కవితేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో కవిత అరెస్టుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ కవితను సీబీఐ అరెస్ట్ చేస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందన్న దానిపైనా అమిత్‌షా ఆరా తీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్..
బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి అత్యవసర పిలుపు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అని బీఆర్‌ఎస్ నేతలు కూడా నిశితంగా గమనిస్తున్నారు. వారిలో ప్రధానంగా ఉన్న అనుమానం కేసీఆర్ కూరుతు, ఎమ్మెల్యే కవిత అరెస్ట్ గురించే. అరెస్ట్ త్వరలో ఉండవచ్చన్న ప్రచారం నేపథ్యంలో అమిత్‌షా నుంచి రాష్ట్ర నేతలకు పిలుపు రావడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ బీఆర్‌ఎస్ నేతల్లోనూ నెలకొంది.
ఇటీవలే బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో నాలుగు గంటలు అత్యవసర సమావేశం నిర్వహించారు. వారం తిరగకముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బీజేపీ నేతలతో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.