
Bandi Sanjay: కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. బండి మోనోపాలిగా వ్యవహరిస్తున్నారని, అధ్యక్షుడిగా ఆయనను తప్పించాలని పలువురు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే బండిని మారుస్తారని ఆశగా ఎదురుచూసిన సీనియర్లకు షాక్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్. 2024 సంస్థాగత ఎన్నికల వరకూ ఆయనే అధ్యక్షుడని క్లారిటీ ఇచ్చారు. బండికి అధిష్టానం అండగా ఉందని చెప్పకే చెప్పాడు.
బండిపై బహిరంగ ప్రకటనలు..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఇటీవల మాట్లాడిన బండి సంజయ్ ‘నేరం చేస్తే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా’ అని వ్యాఖ్యానించారు. దీనిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విభేదించారు. ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. అధ్యక్ష పదవి అంటే బాధ్యత అని, ఏది పడితే అది మాట్లాడటానికి లేదని, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తప్పని వ్యతిరేకించారు. ఆపై బీజేపీలో కీలకంగా వ్యవహరించే శేఖర్‌రావు వంటి నేతలు బాహాటంగానే బండి సంజయ్‌ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టి విమర్శించారు.

అసమ్మతికి షాక్..
ఈ క్రమంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా పదవీకాలం ముగియడంతో, ఆయనను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తమ నిరసన గళం వినిపించడం ద్వారా వ్యక్తం చేశారు. ఈ మేరకు జాతీయ నేతల ద్వారా కూడా అధిష్టానంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. అయితే బండి సంజయ్ వ్యతిరేకించిన వర్గానికి బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ షాక్ ఇచ్చారు. 2024లో పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని, అప్పటివరకు బండి సంజయ్‌ని మార్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పట్లో కొత్త అధ్యక్షుడిని నియమించే ఆలోచన తమకు లేదని సంస్థాగత ఎన్నికల తరువాతే రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ఉంటుందని ప్రకటించారు. తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ సేన బండి సంజయ్ సారథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొబోతోంది అన్నది స్పష్టమైంది. మరి ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను వ్యతిరేకిస్తున్న వర్గం రానున్న ఎన్నికల సమయంలో సంజయ్‌కు సహకరిస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.