Homeజాతీయ వార్తలుTelangana BJP: బండి సంజయ్ ఉంటేనే ముఖం చెల్లుబాటు అవుతుంది

Telangana BJP: బండి సంజయ్ ఉంటేనే ముఖం చెల్లుబాటు అవుతుంది

Telangana BJP: భారతీయ జనతా పార్టీ క్రమంగా దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? సంజయ్ ని తొలగించిన తర్వాత అసలు తప్పు ఏమిటో బోధపడిందా? అందువల్లే నష్ట నివారణ చర్యలకు వేగంగా ఉపక్రమిస్తుందా? అంటే దీనికి అవును అనే అంటున్నాయి భారతీయ జనతా పార్టీలోని కొన్ని వర్గాలు. ఇందులో భాగంగానే త్వరలో జరగబోయే ఎన్నికల్లో నాయకులు మొత్తం సమిష్టిగా పని చేయాలని.. పదవులు ఉన్నంత మాత్రాన కొత్తగా కొమ్ములు రావని స్పష్టం చేసింది. అంతేకాదు గతంలో అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ ని కలుపుకొని పోవాలని సూచించింది.

టిఫిన్ బైఠక్

సోమవారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, ఇతర కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే పార్టీ విస్తరణకు సంబంధించి చర్చ జరిగిన అనంతరం ఒక కీలక నాయకుడు బండి సంజయ్ పాత్ర గురించి ప్రస్తావించారు. అంతేకాదు బండి సంజయ్ లేకుంటే జనాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఇదే కేంద్రంలోని కీలక పెద్దలు కూడా కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆ పెద్దలు ఫోన్ చేయడం వెనక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖ్ లు ఉన్నారని సమాచారం. పార్టీలో ఉన్న ముగ్గురు కీలక నాయకులు వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని పెద్దలు సూచించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో నిర్వహించే టిఫిన్ బైఠక్ కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ అధిష్టానం సూచించింది. ప్రధాన కూడళ్ళలో సమావేశమై సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించింది. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాదులో ఆ రోజున కార్యక్రమం నిర్వహించడం వీలు కాకపోతే మరో రోజు నిర్వహించాలని సూచించింది.

కారణం అదేనా

మొన్న ఢిల్లీ నుంచి బండి సంజయ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. 500 కార్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. యువతలో సంజయ్ పట్ల బాగా క్రేజ్ ఉండడం.. మొన్న వరంగల్లో మోడీ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నప్పుడు యువత కేరింతలు కొట్టడం.. ఇవన్నీ కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దల దృష్టికి వెళ్లాయి. దీంతో వారు భారతీయ జనతా పార్టీ పెద్దలకు వర్తమానం పంపారు.”తెలంగాణలో పార్టీ అభివృద్ధి చెందుతోంది. కీలక సమయంలో నిర్ణయాలు తీసుకోలేదు. బండి సంజయ్ ని కారణం చెప్పకుండా వెనక్కి తీసుకున్నారు. ఇది అంతిమంగా పార్టీ అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదంటూ” రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలు పార్టీ అధిష్టానానికి ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది. ధర్మపురి అరవింద్, మాధవనేని రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వంటి వారు చేసిన కామెంట్ని కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానానికి చురకలు అంటించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లేఖ విషయాన్ని గోప్యంగా ఉంచిన భారతీయ జనతా పార్టీ.. బండి సంజయ్ కి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర అధినాయకత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. పైగా బండి సంజయ్ ని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పెద్దలు చక్రం తిప్పినట్టు సమాచారం.

అందుకే ఏర్పాటు చేశారా

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో వినూత్న విధానంలో ప్రజల వద్దకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అయితే పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ లు మొత్తం నియోజకవర్గాలు చుట్టి రావాలని ఒక అంచనాకు వచ్చింది. బండి సంజయ్ అంటే యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టే.. టిఫిన్ బైఠక్ వంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనుంది. ఇది ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలు పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే బండి సంజయ్ కి ఆ పరిమితమైన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ చేసిన తప్పేంటో గుర్తించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన జన్మదినం సందర్భంగా వారణాసి వెళ్లిన బండి సంజయ్.. అక్కడ ఏ మంత్రాంగం నెరిపారో కానీ ఒకసారి పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారిపోతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular