Telangana BJP: అసెంబ్లీలో “నాలుగో ఆర్” పై కమలం గురి పెట్టింది. అసెంబ్లీలో ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు ఈ మూడు ఆర్ లను బీజేపీ కలిగి ఉంది. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం.. బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని కమల నాథులు కంకణ బద్ధులై ఉన్నారు. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచారు. శాసనసభలో పార్టీని “త్రిబుల్ ఆర్” లాగా కొనసాగిస్తున్నారు.

…
రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి నాలుగో ఆర్ ను జత కలపాలని..
…
త్వరలో పార్టీలో చేరబోయే రాజగోపాల్ రెడ్డి ని మునుగోడు లో గెలిపించుకుని నాలుగో ఆర్ ను అసెంబ్లీలోకి పంపాలని బిజెపి నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం బండి సంజయ్ ఉమ్మడి నల్లగొండలో ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. బుధవారం యాత్ర మధ్యాహ్నం భోజన సమయంలో బండి సంజయ్, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మధ్యప్రదేశ్, బీజేపీ ఇన్చార్జి మురళీధర్ రావు, పలువురు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలను చర్చించారు. గతంలో దుబ్బాక హుజురాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో అనుసరించిన ఇవ్వాలని ఇక్కడ కూడా అమల్లోకి పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే గత ఉప ఎన్నికల సమయంలో పార్టీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరించారు. పైగా ఆయనది లక్కీ హ్యాండ్ అనే పేరు ఉంది. ఆయనకే మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు తోడుగా నియోజకవర్గ పరిధిలోని మండలాలు, మునిసిపాలిటీల్లో పార్టీ ఎన్నికల ప్రచార సమన్వయానికి 10 మంది ఇన్చార్జిలను నియమిస్తున్నారని సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులపై వివిధ సంస్థలతో సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సర్వేల ఆధారంగానే ఇన్చార్జిల నియామక ఉంటుందని పార్టీకి చెందిన కీలక నేతలు అంటున్నారు.

..
అధిష్టానానికి నివేదిక
…
మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి పార్టీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం ఒక నివేదిక పంపినట్టు తెలుస్తోంది. అందులో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగతంగా పార్టీ బలాలు, బలహీనతలు, సామాజిక వర్గాల ప్రాబల్యం తదితర అంశాలను ప్రస్తావించారు. మునుగోడులో యాదవ, గౌడ పద్మశాలి, రెడ్డి, లంబాడ, మాదిగ సామాజిక వర్గాల చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో వీరంతా కూడా కాంగ్రెస్కే జై కొట్టారు. రాజగోపాల్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేశారు. తన సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ యువత కోసం పలుమార్లు జాబ్ మేళాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ నుంచి అభ్యర్థుల ప్రకటన వెలువడకపోవడంతో రాజగోపాల్ రెడ్డి మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఓవైపు బిజెపిలో చేరేది లాంచనమనే సంకేతాలు ఇస్తూనే.. కాంగ్రెస్ పార్టీలో తన బలగాన్ని బిజెపి వైపు మళ్లించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పలువురు పార్టీ నాయకులపై సస్పెన్షన్ విధించడంతో వారంతా కూడా రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించారు. ఆయన కూడా వారందరినీ బిజెపిలో చేర్పించాలని చూస్తున్నారు.