
తెలంగాణకు, ఏపీకి ఉన్న తేడా అదే.. అవును.. తెలంగాణలో ఆదాయం, ఆచరణ తక్కువగానే ఉన్నా ఆప్యాయత, అనురాగాలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు.. కష్టమొస్తే అందరూ ఏకమయ్యే స్వభావమూ ఎక్కువే. కులం, మతం కార్డులు తెలంగాణలో పెద్దగా పనిచేయవు. కానీ ఆంధ్రాలో ‘కుల’పోట్లు ఎక్కువ. కమ్మ, రెడ్లు, కాపులు అంటూ ప్రతీదాంట్లోనూ కుల కుంపట్లే.. వేరుబాటే.. ఇప్పుడే ఆ వేరు రాష్ట్ర ప్రయోజనాల వరకు వచ్చేసరికి కూడా కనిపిస్తోంది. అదే ఆంధ్రాపాలిట శాపంగా మారుతుండగా.. తెలంగాణలో ఆ ఐక్యత.. రాష్ట్రం సాధించినట్టే ఇప్పుడు జలం కోసం కూడా ఒక్కటయ్యేలా చేస్తోంది.
*పోతిరెడ్డిపాడు జలంపై జగన్ ఒంటరి
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటరీ నుంచి రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించేందుకు జగన్ సర్కార్ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. ఇన్నాళ్లు అన్నాదమ్ముళ్లుగా ఉన్న కేసీఆర్-జగన్ లు రాష్ట్ర ప్రయోజనాల కోసం అడ్డంగా విడిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి తెలంగాణ పక్షపాతి.. నిధులు, నీళ్ల, నియమాకాల కోసమే ఉద్యమించారు. రాష్ట్రం సాధించారు. అందుకే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ నీటిదోపిడీపై కేంద్రానికి, కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులోనూ పిటీషన్ వేయడానికి రెడీ అయ్యారు. అదే ఏపీలో ట్రెయిన్ రివర్స్ అయ్యింది. జగన్ కు సపోర్టుగా టీడీపీ, జనసేన స్పందించలేదు.. చంద్రబాబు మౌనం దాల్చారు. పవన్ కనీసం ట్విట్టర్ గూట్లోనూ పలకలేదు. బీజేపీ కన్నా లక్ష్మీనారాయణకు సీమ పై ధ్యాసలేదు. దీంతో సీఎం జగన్ ఒంటరి అయిపోయారు.
*ఒక్కటైన తెలంగాణ సమాజం..
ఏపీ రాయలసీమకు నీటి తరలింపు జీవో రాగానే జెండాలు, అజెండాలు పక్కనపెట్టి తెలంగాణ సమాజం ఒక్కటైంది. కేసీఆర్ ప్రభుత్వ పరంగా స్టిక్ట్ గా ముందుకెళ్తున్నారు. జగన్ తో దోస్తీ కంటే తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. టీజేఎస్ కోదండరాం దీనిపై పోరుబాటుకు శ్రీకారం చుట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా దీనిపై బుధవారం ధర్నాల నిర్వహణకు పిలుపునిచ్చాడు. ఇలా కేసీఆర్ మొదలు ఉత్తమ్, కోదండరాం, వామపక్షాలన్నీ ఆంధ్రా నీటి తరలింపునకు వ్యతిరేకంగా ఉద్యమించి సమాజం ఒక్కతాటిపైకి రావడం విశేషం.
*రాజకీయమే ఏపీకి శాపం..
తెలంగాణలో ఉద్యమమైనా.. అభివృద్ధి అయినా ప్రజలు, రాజకీయ పార్టీలు తెలంగాణకు మేలు జరుగుతుంది.. కీడు జరుగుతుంది అంటే ఒక్కటవుతారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరువు సీమ రాయలసీమకు నీటి తరలింపుపై జగన్ జీవో జారీ చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదు. ఆయన తీరు చూస్తుంటే తెలంగాణకే మద్దతుగా ఉన్నట్టు అనిపిస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇక చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేసే పవన్ కళ్యాణ్ సైతం ఇంత భారీ స్టెప్ జగన్ తీసుకుంటే దానిపై స్పందించలేదు. రాజధాని మార్పుపై దీక్షలు, ధర్నాలు చేసినా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నోరు మెదపడం లేదు. ఇలా నిత్యావసరమైన నీటి కోసం తెలంగాణ ప్రజలంతా ఒక్కటైతే.. ఆంధ్రా రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా తమ ప్రాంత హక్కుల విషయంలో తలోదారి అన్నట్టుగా ప్రవర్తించడం.. నిజంగా అక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
–నరేశ్ ఎన్నం